Begin typing your search above and press return to search.

'అంబేడ్క‌ర్ జిల్లా' పేరుపై జ‌గ‌న్ వెన‌క్కి.. స‌త్తా లేదా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
అంబేడ్క‌ర్ జిల్లా పేరుపై జ‌గ‌న్ వెన‌క్కి.. స‌త్తా లేదా?
X
``151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. భారీ, అతిభారీ మెజారిటీ. అయితేనేం.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే స‌త్తా లేదు .`` ఇదీ.. ఇప్పుడు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఉద్దేశించి నెటిజ‌న్లు చేస్తున్న విమ‌ర్శ‌లు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టికే ఆయ న తీసుకున్న చాలా నిర్ణ‌యాలు వెన‌క్కి తీసుకోవ‌డ‌మే. తాజాగా ప‌చ్చ‌టి కోన‌సీమ జిల్లా పేరును మారుస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఇక్క‌డ వెల్లువెత్తిన విమ‌ర్శ‌ల‌కు.. అల్ల‌ర్ల‌కు జంకార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి మూడు మాసాల కింద‌ట కొత్త జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలో ఉమ్మ‌డి తూర్పు గోదావరిలో కోన‌సీమ ప్రాంతాన్ని ఒక‌ జిల్లాగా ప్ర‌క‌టించారు.

అయితే.. అప్ప‌ట్లో దీనికి అంబేడ్క‌ర్ జిల్లాగా పేరు పెట్టాలంటూ.. ఎస్సీలు ఆందోళ‌న నిర్వ‌హించారు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ల‌కు సంబంధించి రెండు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న నేప‌థ్యంలో ఈ ప్రాంతానికి `అంబేడ్క‌ర్ జిల్లా`గా పేరు పెట్టాల‌ని కోరారు. చాలా రోజులు ఇక్క‌డ టెంట్లు వేసుకుని మ‌రీ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి నివేదిక‌లు కూడా ఇచ్చారు. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ పెడ‌చెవిన పెట్టారు. త‌ర్వాత .. కోన‌సీమ జిల్లాగానే దీనిని పేర్కొంటూ.. గెజిట్ ఇచ్చారు. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న‌కు అందిన నివేదికల మేర‌కు.. అనూహ్యంగా వ్యూహం మార్చుకున్నారు.

ఆందోళ‌న‌ల‌ను స‌ర్దుమ‌ణిగిన త‌ర్వాత‌.. అంతా కోన‌సీమ జిల్లాకు అల‌వాటు ప‌డిపోయిన త‌ర్వాత‌.. వ‌న్ ఫైన్ డే.. ఆయ‌న ఈ జిల్లా పేరును మారుస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. అదే `అంబేడ్క‌ర్ జిల్లా`. ఇక‌, దీనిపై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కోసం నెల రోజుల స‌మ‌యం ఇచ్చారు. దీంతో ఇక్క‌డి వైసీపీ నాయ‌కులే దీనిపై ఉద్య‌మం చేశారు. పేరు మార్చ‌డానికి వీల్లేదంటూ.. ఈ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లారు. దీనికి రాజ‌కీయ రంగు పులుముకుంది. ఎస్సీల ఆధిప‌త్యం పెరిగిపోతుంద‌ని భావించిన వైసీపీ నాయ‌కులు ఈ ఉద్య‌మాన్ని తెర‌వెను ఉండి న‌డిపించార‌ని.. వైసీపీ నాయ‌కులే ఆరోపించారు.

ఈ క్ర‌మంలో వెల్లువెత్తిన ఆందోళ‌న‌ల్లో ఎస్సీ మంత్రి పినిపే విశ్వ‌రూప్ ఇంటిని ఆందోళ‌న కారులు(వీరిలో ఎక్కువ‌గా వైసీపీ వారే ఉన్నార‌ని అరెస్టుల‌ను బ‌ట్టి తెలుస్తోంది) త‌గ‌ల‌బెట్టారు. బీసీ ఎమ్మెల్యే స‌తీష్ ఇంటిని కూడా ద‌హ‌నం చేశారు. ఈ జిల్లాకు కోన‌సీమ పేరునే ఉంచాల‌ని డిమాండ్ చేశారు. అయితే.. ఎవ‌రు ఎన్ని ఆందోళ‌న‌లు చేసినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. అప్ప‌ట్లో ప్ర‌భుత్వ మాట‌గా.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఇక‌, ఈ జిల్లాకు అంబేడ్క‌ర్ పేరు పెడ‌తార‌నే అంద‌రూ అనుకున్నారు.

క‌ట్ చేస్తే.. తాజాగా జ‌రిగిన రాష్ట్ర కేబినెట్ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గారు. తొలుత ప్ర‌క‌టించిన `అంబేడ్క‌ర్ జిల్లా` పేరులో మార్పు చేశారు. అల్ల‌ర్లు.. ఆందోళ‌న‌లకు ఆయ‌న త‌లొగ్గారా? అని సందేహాలు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించారు. ఈ జిల్లాకు `అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా`గా పేరు మారుస్తూ.. కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. నిజానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ పేరుకు ప్రాశ‌స్త్యం తీసుకురావాలంటే.. నేరుగా ఆయ‌న పేరునే జిల్లాకు ఉంచితే.. బాగుండేది. కానీ, త‌న పార్టీ వారే ఉద్య‌మించ‌డంతో వెన‌క్కి త‌గ్గిన జ‌గ‌న్‌.. కోన‌సీమ‌కు అంబేడ్క‌ర్ పేరును జోడించారు.

గ‌తంలో నెల్లూరు జిల్లాకు కూడా అక్క‌డ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. కానీ, నిజానికి పొట్టి శ్రీరాములుకు అనుకున్నంత పేరు రాలేదు. ఆయ‌న పేరుతో ఇప్ప‌టికీ 100కి 80 మంది ఈ జిల్లా పేరును పిల‌వ‌రు. ఇప్ప‌టికీ నెల్లూరు అనే పిలుస్తారు. ఇప్పుడు ఇలానే.. కోన‌సీమ జిల్లా కు కూడా అంబేడ్క‌ర్ పేరు పెట్టినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఇది ఎస్సీల‌ను మాయ‌చేయ‌డ‌మేన‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.