Begin typing your search above and press return to search.

తెలిసి మరీ జగన్ తప్పు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   18 Jan 2017 7:17 AM GMT
తెలిసి మరీ జగన్ తప్పు చేస్తున్నారా?
X
కొన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకోవటంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు. కానీ.. కొన్ని అంశాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో జరిగే ఆలస్యానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అలాంటి తప్పే చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిపోయి రెండున్నరేళ్లకు మరో నెల కూడా గడిచిపోయినా.. నేటికీ.. ఏపీలో ఆయన పార్టీకి ప్రధాన కార్యాలయం లేకపోవటం ఆపార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తోంది.

విభజనలో భాగంగా హైదరాబాద్ మహానగరం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ.. ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసాన్ని.. అసెంబ్లీని.. సెక్రటేరియట్ ను. . ఉద్యోగుల్ని ఏపీ రాజధానికి షిఫ్ట్ చేయటం తెలిసిందే. అధికారపక్షం.. ప్రభుత్వం ఏపీకి తరలివెళ్లిన తర్వాత రాజకీయ పార్టీలు మాత్రమే హైదరాబాద్ లో ఉండటం అర్థం లేని పని.

అందుకే.. పలు రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాల్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అన్నిపార్టీలు ఏపీకి వెళ్లిపోయినా..ఏపీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం హైదరాబాద్ లో ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది. అలా అని ఆ పార్టీ తెలంగాణలో బలంగా ఉందంటే అదీ లేదు. నిజానికి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నామమాత్రమైన బలం కూడా లేదన్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు హైదరాబాద్ లోపార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఉంచటంలో ఎంతమాత్రం అర్థం లేనిపనిగా పలువురు చెబుతున్నా.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడా పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి.. పార్టీ కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని.. లోటస్ పాండ్ తరహాలోనే భారీ భవనాన్ని నిర్మించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతారు. ఇందుకు సంబంధించిన పనులు గతంలోనే ప్రారంభం కావాల్సి ఉందని.. అయితే ఎందుకు మొదలుకాలేదో తమకు అర్థం కావటం లేదని పలువురు నేతలు వాపోవటం గమనార్హం. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం భూమిని కేటాయించినా.. అది బీజేపీకి ఇచ్చినంతే ఇవ్వటంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని.. సొంతంగానే స్థలాన్ని కొనుక్కొని భవనం నిర్మించుకుందామని ఆయన చెప్పినట్లుగా చెబుతారు.

అయితే.. మాటలే కానీ.. చేతల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం సాగకపోవటంపై జగన్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగ రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్న వేళ.. ఇప్పటికి హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదని.. సొంత పార్టీకార్యాలయాన్ని కూడా ఏపీలో ఏర్పాటు చేయలేదంటూ ఏపీ అధికారపక్షం కానీ ప్రశ్నిస్తే.. తమకు జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందని జగన్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన విషయంపై అధినేత కాలయాపన ఎందుకు చేస్తున్నారో అర్థం కాక.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/