Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పంచాయితీ జగన్? యోగి వేమనను తీసేయాల్సిందేనా?

By:  Tupaki Desk   |   10 Nov 2022 5:58 AM GMT
ఇదెక్కడి పంచాయితీ జగన్? యోగి వేమనను తీసేయాల్సిందేనా?
X
ఎంత అభిమానం ఉంటే మాత్రం.. ఎక్కడ చూసినా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం మాత్రమే ఉండాలి. ఆయన పేరు మాత్రమే కనిపించాలన్నట్లుగా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు భావిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మొన్నటికి మొన్న డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వర్సిటీకి పేరు పెట్టిన వైనం.. దానికి వైసీపీ నేతలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ తెలిసిందే. ఎన్టీఆర్ పేరును ఎందుకు మార్చారని ప్రశ్నిస్తే.. అందుకు ఎలా ప్రతిదాడి చేశారో తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని అమలు చేశారు అధికారులు. ప్రజా కవిగా యోగి వేమన సుపరిచితుడు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వారు ఎవరైనా సరే.. బాల్యం నుంచే ఆయన గొప్పతనాన్ని.. ఆయన పద్యాల్ని వింటూ పెరుగుతారు. అలాంటి యోగి వేమన పేరుతో 2006లో కడపలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా వైఎస్ ఉన్నప్పుడే. ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేశారు.

విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలనా భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు ఏమైందోకానీ.. వేమన విగ్రహాన్ని తొలగించేసి గేటు పక్కనపెట్టారు. గతంలో వేమన విగ్రహం ఉన్న చోటున దివంగత మహానేత వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది వైఎస్. అయినప్పటికీ వేమన విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్టీఆర్ పేరు నచ్చలేదు.. ఆయన విగ్రహం నచ్చలేదంటే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యోగి వేమన వంతు వచ్చింది. మరి.. దీనికి ఏపీ అధికారపక్ష నేతలు ఎలాంటి వాదనలు వినిపిస్తారో? ఏరీతిలో సమర్థించుకుంటారో? మరే రీతిలో ప్రచారం చేసుకుంటారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.