Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్ లో సొంత జిల్లా నేత ఎవరు?

By:  Tupaki Desk   |   5 Jun 2019 8:46 AM GMT
జగన్ కేబినెట్ లో సొంత జిల్లా నేత ఎవరు?
X
వైసీపీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. మూడు జిల్లాల్లో ఖాతా కూడా తెరవనంతగా చిత్తుగా ఓడిపోయింది. ఆ మూడు జిల్లాల్లో వైఎస్ జగన్ సొంత జిల్లా కడప ఒకటి. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనతోపాటు మరొకరికి కేబినెట్ లో చాన్స్ దక్కడం ఖాయం. అయితే మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ భాషాకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

వైసీపీ అధినేత జగన్ ఈ నెల 8న విస్తరించే కేబినెట్ లో మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వడం లాంఛనమే. అయితే బాలయ్య చేతిలో ఓడిపోయిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నానని జగన్ ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అయిన ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం సాగింది. ఇక ఈయన కాకుంటే కడప జిల్లా నుంచి తీసుకుంటే మాత్రం కడప ఎమ్మెల్యే అంజాద్ భాషాకు మంత్రి పదవి రేసులో ముందున్నారు..

ఇక మైనార్టీ కోటాను పక్కనపెడితే మాత్రం కడప జిల్లా నుంచి జగన్ తోపాటు సీనియర్ అయిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాసులు జగన్ కు సన్నిహితుడు. జగన్ వెంట నాలుగేళ్లుగా ఉన్నారు. సాన్నిహిత్యం దృష్ట్యా ఈయనకే మంత్రి పదవి ఇవ్వొచ్చంటున్నారు.

ఇలా కడప జిల్లా కేంద్రంగా మంత్రి పదవులపై ఆశతో అంజాద్ భాషా - శ్రీనివాసులు ఉన్నారు. మరి జగన్ ఏ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని పదవులు కేటాయిస్తాడన్నది వేచి చూడాల్సిందే.