Begin typing your search above and press return to search.

పాదయాత్ర ముగింపు..పోరు యాత్రం ప్రారంభం

By:  Tupaki Desk   |   26 Dec 2018 4:46 PM GMT
పాదయాత్ర ముగింపు..పోరు యాత్రం ప్రారంభం
X
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపుకు చచ్చింది. గతేడాది నవంబర్ నెల 6 వ తేదీన ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర వచ్చే నెల 8 వ తేదీన ముగుస్తుంది. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. దాదాపు 14 నెలల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలో ముగిస్తున్నారు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. అయితే ఈ పాదయాత్రే తన ఎన్నికల పోరుకు ప్రారంభయాత్రగా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. కొత్తసంవత్సరం...జనవరి 8 వ తేదీన ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభను నిర్వహించనున్నారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్చాపురంలో ఓ పైలాన్ కూడా ఆవిష్కరించాలని పార్టీ నాయకుల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభే వేదికగా జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ తో పాటు ఎన్నికల శంఖరావాన్ని కూడా పూరించే అవకాశాలున్నాయంటున్నారు.

లోక్‌ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరగనుండడంతో కార్యచరణను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఏడాది కాలంగా చేపట్టిన పాదయాత్రలో తాను వెళ్లలేక పోయిన నియోజకవర్గాలకు బస్సుల్లో వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఈ యాత్రలోనే ఒకవైపు నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు అభ్యర్ధుల ఎంపిక వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు - సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జగన్ ఇంత వరకూ క్రియాశీలకంగా వ్యవహరించలేదు., దీంతో ఇక ముందు ఈ అంశంపై కూడా మరింత కీలకంగా వ్యవహరించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా జగనే స్వయంగా దీక్ష చేయాలని కూడా గర్జనకు కూడా జగన్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. రానున్న ఎన్నికల కాలంలో జగన్ మోహన్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.