Begin typing your search above and press return to search.

అప్పుడు జగన్ పాదయాత్రలో కనిపించిన సీన్ ఇప్పుడు బాబు రోడ్ షోలలో రిపీట్?

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:29 AM GMT
అప్పుడు జగన్ పాదయాత్రలో కనిపించిన సీన్ ఇప్పుడు బాబు రోడ్ షోలలో రిపీట్?
X
'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొదట్లో ఈ ప్రోగ్రాం మీద పెద్ద అంచనాలు లేవు. దీనికి తోడు క్యాచీగా లేని పేరుతో.. కాస్త భిన్నమైన రీతిలో ఉన్న క్యాప్షన్ పట్టుకొని ప్రజల్లోకి వెళుతున్న చంద్రబాబు ఏమేర ప్రభావం చూపుతారన్న దానిపై కాస్తంత సందేహాలు ఉన్న మాట వాస్తవం. అయితే.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అన్న సిరీస్ లో భాగంగా నిర్వహిస్తున్న సభలకు వస్తున్న ప్రజా స్పందన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఓపక్క జగన్మోహన్ రెడ్డి సర్కారు దూసుకెళ్లిపోతున్నట్లుగా వైసీపీ నేతలు చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనసందోహం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తోంది. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా అలుపు ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న సభలకు.. పోటెత్తుతున్నారు. అయితే.. సభలు అట్టర ప్లాప్ అవుతున్నట్లుగా అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థల్లో వార్తలు టెలికాస్టు అవుతున్నాయి.

దీంతో.. వారి వార్తకు వారి స్టైల్లోనే సమాధానం ఇచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు రెఢీ అయిపోయారు. రాజాంలో నిర్వహించిన సభకు హాజరైన జనసందోహం ఏ స్థాయిలో ఉందో అన్నది అర్థమయ్యే చిట్టి వీడియోను సిద్ధం చేశారు. ఇందులో చంద్రబాబు సభ ప్లాప్ అయ్యిందన్న మాట అనంతరం.. చూపించిన విజువుల్స్ చూస్తే.. వావ్ అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

నిజానికి ఈ వీడియోలో మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున జనం పోటెత్తుతున్నారు. అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోంది. దీనికి ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభను చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మంలో సభను నిర్వహించటం ద్వారా చంద్రబాబు రిస్కు తీసుకుంటారన్న మాట వినిపించింది. కానీ.. అందుకు భిన్నంగా సూపర్ సక్సెస్ కావటం తెలిసిందే.

ఇక.. ఏపీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పోటెత్తుతున్న జన సందోహాన్ని చూస్తున్న వారంతా.. జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రజాదరణలో వచ్చిన మార్పు అప్పట్లో కొట్టొచ్చినట్లుగా కనిపించటం తెలిసిందే.

కడపలో మొదలైన జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లా వరకు ఒక ఎత్తు అయితే.. టీడీపీకి కంచుకోటగా నిలుస్తుందని భావించిన గుంటూరు (ఉమ్మడి) జిల్లాలో పాదయాత్ర సందర్భంగా వచ్చిన స్పందన అప్పట్లో అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. తాజాగా చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు వస్తున్న ఆదరణ అదే స్థాయిలో ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.