Begin typing your search above and press return to search.

పదును తేరిన పవన్...పెంచుకుంటూ పోతున్న జగన్

By:  Tupaki Desk   |   14 Nov 2022 8:30 AM GMT
పదును తేరిన పవన్...పెంచుకుంటూ పోతున్న జగన్
X
ఏపీలో చిత్రమైన రాజకీయం నడుస్తోంది. అధికార వైసీపీకి టీడీపీ జసేన రెండూ ప్రత్యర్ధులే. అందులో నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉండి గ్రౌండ్ లెవెల్ లో గట్టి పట్టున్న తెలుగుదేశమే సరైన ఆల్టర్నేషన్ అని అందరికీ ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇపుడు ఏపీలో మారుతున్న రాజకీయం చూస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరుగుతోంది. వరస క్రమంలో మూడవ స్థానంలో ఉన్న జనసేన చాలా వేగంగా రెండవ స్థానం వైపుగా వచ్చేందుకు దూకుడు చేస్తోంది

మరో వైపు జనసేన దూకుడుకు అటు బీజేపీ ఒక చేయి వేస్తే ఇపుడు వైసీపీ రెండు చేతులు వేసి మరీ సహకరిస్తోంది. నిజంగా వైసీపీ జనసేన జోరును పెంచుతోందా ఇది నమ్మశక్యమా అంటే రాజకీయం అంటే ఇదే మరి. ఏపీలో పవన్ అంటే జగన్ కి పడదు అని అంటారు. అలాగే జగన్ పేరెత్తితేనే ఫైర్ అవుతారు పవన్. అలాంటి జనసేనను పెంచాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు ఉంటుంది అంటే రాజకీయ తమాషాల్లో దీన్ని కూడా ఒకటిగా చూడాల్సి ఉంది.

ఏపీలో పవన్ ఎంతలా ఎదిగితే అది తమకు మంచిదని వైసీపీ భావిస్తోంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జనసేన కొల్లగొట్టేది అత్యధిక భాగం టీడీపీ ఓట్లే. ఇది గత ఎన్నికల్లోనే రుజువు అయింది. టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలుగా ఉత్తరాంధ్రా, గోదావరి ఉత్తర కోస్తా జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 101 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికలను చూసుకున్నా ఇక్కడే మెజారిటీ సీట్లను టీడీపీ సాధించింది. అలా అధికారంలోకి వచ్చింది

ఇక వైసీపీ బలం ఏంటి అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 74 సీట్లు. వీటికో అత్యధిక శాతం ఎపుడూ వైసీపీ ఖాతాలో పడుతూంటాయి. 2019 ఎన్నికల్లో అయితే 99 శాతం సీట్లు ఆ పార్టీ పరం అయ్యాయి. 2024 ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని వైసీపీ అంచనా కడుతోంది. ఈ మొత్తం 74లో 15కి పైగా సీట్ల దాకా పోయి 55 పైగా సీట్లకు వైసీపీ పరిమితం అయినా కావచ్చు అన్నది కూడా విశ్లేషణగా ఉంది.

అంటే ఏపీలో పవర్ లోకి రావాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అంటే అక్కడికి ముప్పయి సీట్ల దాకా వైసీపీకి కొరత ఉంటుంది. వాటికి కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే తీసుకోవాలి. గతంలో 90 శాతం పైగా సీట్లు వైసీపీ పరం అయ్యాయి. ఈసారి అందులో మూడవ వంతు సీట్లు వస్తాయా అన్నదే ఒక ఆలోచన. అంటే ఓ నలభై సీట్ల దాకా కోస్తాలో ఉత్తరాంధ్రాలో వైసీపీ కొడితేనే 95 నుంచి వంద దాకా సీట్లతో సింపుల్ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుంది.

దాంతో కోస్తా జిల్లాలలో టీడీపీ జనసేనల ప్రభావం తగ్గించాలీ అంటే ఫస్ట్ ఎత్తుగడ పొత్తులు ఉండకూడదు. రెండవది ఒకవేళ పొత్తులు ఉన్నా అవి టీడీపీకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలి. అంటే జనసేన సీట్ల విషయంలో డామినేటింగ్ రోల్ ని ప్లే చేసి ఎక్కువకు డిమాండ్ చేయడం. ఒక విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఇక్కడ సీట్లను జనసేన కోరితే మాత్రం పొత్తు కుదిరినా అది హిట్ అయితే కాదు. ఎందుకంటే తమ్ముళ్ళలో అది తీవ్ర అసంతృప్తికి దారి తీసి పొత్తులు బీటలు వారుతుంది.

ఆ విధంగా చేయాలన్న ఎత్తుగడలతోనే పవన్ కి బాగా చాన్స్ ఇచ్చెస్తోంది వైసీపీ అని అంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలో జరిగిన ఘటనలు చూసుకుంటే చాలు ఒక్కసారిగా పవన్ గ్రాఫ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ పిలిపించుకుని అరగంటకు పైగా భేటీ వేయడం ద్వారా బీజేపీ మార్క్ పాలిటిక్స్ మరో వైపు చేస్తోంది. అది కూడా టీడీపీకి ఇబ్బందికరమే అవుతుంది. ఇంకో వైపు చూస్తే వైసీపీ పవన్ని నియంత్రించడం ద్వారా కట్టడి చేయడం ద్వారా ఆయన ఇమేజ్ ని డబుల్ చేస్తోంది.

దీంతో పవన్ లో కానీ జనసేనలో కానీ తమదే అధికారం అన్న ఆలోచనలు వచ్చేస్తున్నాయి. తానే కాబోయే సీఎం అని పవన్ విజయనగరం సభలో ప్రకటించుకున్నారు. రేపటి రోజున ఆయన టీడీపీతో పొత్తుకు వెళ్ళినా ఇదే ప్రస్థావిస్తారు. సీట్లు ఎక్కువ అడగడమే కాదు, పవర్ షేరింగ్ కూడా అడుగుతున్నారు. ఇలా ఏపీలో వైసీపీ చేస్తున్న రాజకీయం తో పాటు బీజేపీ ప్లాన్స్ తో పవన్ జనసేన టీడీపీకి అందనంత ఎత్తున ఉన్నారనే అంటున్నారు.

ఈ కీలకసమయంలో పొత్తులతో వెళ్ళినా లేక పొత్తులు కుదుర్చుకున్నా అంత సాఫీగా ఏపీలో రాజకీయ కధ సాగదు. అదే వైసీపీకి కావాల్సింది. ఈ పొత్తుల ఎత్తులు ఏదో మాదిరిగా చిత్తు అయితే చాలు ఏపీలో మరో మారు పాగా వేసేందుకు వైసీపీకి చాన్స్ ఉంటుంది. అదే ఇపుడు జరుగుతున్న రాజకీయం అంటున్నారు.

అందుకే పవన్ని పెంచేస్తున్నారు అని అంటున్నారు. ఈ మొత్తం వ్యూహం తెలిసో తెలియకో కానీ ఇప్పటిదాకా టీడీపీ దాని అనుకూల మీడియా పవన్ని ఎత్తేస్తోంది. మరి ఆయన ఇపుడు కొరుకుడు పడని డిమాండ్లు పెడితే మాత్రం పసుపు పార్టీకి పచ్చి వెలక్కాయ పడినట్లే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.