Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బ... కుప్పంలో టీడీపీ చిత్తు చిత్తు

By:  Tupaki Desk   |   14 March 2020 5:30 PM GMT
జగన్ దెబ్బ... కుప్పంలో టీడీపీ చిత్తు చిత్తు
X
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెను సంచలనాలే నమోదవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా... విపక్ష టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయి. నేతల తో పాటు టీడీపీ చేతిలోని చాలా స్థానిక సంస్థలు వైసీపీకి దఖలు పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో విపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది.

కుప్పంలో మొత్తం 95 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో ఏకంగా 76 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవమైన స్థానాలన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి తప్పించి టీడీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదట. ఇక ఏకగ్రీవం కాకుండా మిగిలిపోయిన 19 స్థానాల్లో వైసీపీ తో టీడీపీ హోరాహోరీగా తరలపడక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో ఈ 19 స్థానాల్లో అయినా పోటీ ఉంటుందా? లేదంటే... అవి కూడా వైసీపీ ఖాతాలో పడిపోతాయా అన్న దిశగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయినా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలా ఏకంగా 76 ఎంపీటీసీలు ఎలా ఏకగ్రీవమయ్యాయన్నది ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్న వైసీపీ దౌర్జన్యానికి పాల్పడి ఉంటే... ఇప్పుడు బరిలో నిలిచిన 19 మంది టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేయగలిగారన్నది వైసీపీ ప్రశ్నగా వినిపిస్తున్న మాట. నిజమే... 76 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ... 19 స్థానాలను ఎందుకు వదిలేస్తుంది? అంటే... టీడీపీ నేతలే వైసీపీ ప్రభంజనం ముందు నిలవలేక నామినేషన్లు వద్దనుకుని తప్పుకున్నారా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 95 స్థానాలకు గాను 76 స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయంటే నిజంగానే... అక్కడ టీడీపీ చిత్తు చిత్తుగా ఓడినట్టేనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.