Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తిరిగొచ్చారు.. దంచుడు మొద‌లేనా?

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:37 AM GMT
జ‌గ‌న్ తిరిగొచ్చారు.. దంచుడు మొద‌లేనా?
X
గ‌త కొంత‌కాలంగా ఏపీలో రాజ‌కీయం కాస్త సైలెంట్ గా ఉంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విదేశాల‌కు వెళ్ల‌ట‌మే కార‌ణం. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో - ఫ్యామిలీ టూర్ల‌లో.. త‌న పూర్తి స‌మ‌యాన్ని కుటుంబానికే కేటాయించ‌టం జ‌గ‌న్‌కు అల‌వాటు.

ఆ మాట‌కు వ‌స్తే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించేవారు. దేశంలో ఉన్నప్పుడు కుటుంబం కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే వైఎస్‌.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఫారిన్ టూర్ల‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రం త‌న స‌మ‌యం మొత్తాన్ని కుటుంబానికే కేటాయించేవారు. తండ్రి బాట‌లోనే జ‌గ‌న్ న‌డుస్తున్నార‌ని చెప్పాలి.

జ‌గ‌న్ కుమార్తె హ‌ర్ష‌ను లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో చేర్చేందుకు లండ‌న్ వెళ్ల‌టం తెలిసిందే. ఈ నెల 11న ఇంగ్లండ్‌ కు వెళ్లిన జ‌గ‌న్ తాజాగా తిరిగి వ‌చ్చారు. జ‌గ‌న్ రాక‌తో ఏపీలో రాజ‌కీయం మళ్లీ సంద‌డిగా మార‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల్ని చీల్చి చెండాడ‌ట‌మే కాదు.. ఘాటు వ్యాఖ్యల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ని తీరును బండ‌కేసి బాదేసిన‌ట్లుగా చేస్తారు. కొద్ది రోజులుగా ఫారిన్ టూర్లో ఉన్న జ‌గ‌న్‌.. తిరిగిరావ‌టంతో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత చైత‌న్యం కావ‌టం ఖాయం.

అమ‌రావ‌తికి స‌మీపంలో నిర్మిస్తున్న వైసీపీ పార్టీ కార్యాల‌యాన్ని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించ‌టంతో పాటు.. జ‌గ‌న్ కూడా అక్క‌డే ఉండ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌పై హైద‌రాబాద్ కు అప్పుడ‌ప్ప‌డు మాత్ర‌మే జ‌గ‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. త‌న పూర్తి స‌మ‌యాన్ని ఏపీకే కేటాయించ‌టంతో పాటు.. త్వ‌ర‌లో పాద‌యాత్ర షెడ్యూల్ కూడా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే.. ఏపీ రాజ‌కీయం రాజుకోవ‌టం ఖాయం.