Begin typing your search above and press return to search.

వేలెత్తి చూపించే ఛాన్సు ఇచ్చిన జగన్?

By:  Tupaki Desk   |   21 Oct 2021 5:30 PM GMT
వేలెత్తి చూపించే ఛాన్సు ఇచ్చిన జగన్?
X
ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడి మాదిరి తరచూ మీడియా ముందుకు రావటానికి.. గంటల కొద్దీ మాట్లాడటానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. ఆ మాటకు వస్తే విపక్ష నేతగా ఉన్న వేళలో.. అవసరమైతేనే మీడియా ముందుకు వచ్చేవారు. ఇలా అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన రియాక్టు అయ్యే తీరు ఒకేలా ఉంటుంది. అసెంబ్లీలో విరుచుకుపడినంతగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆవేశానికి.. ఆగ్రహానికి గురి కావటం జగన్ కు పెద్దగా అలవాటు ఉండదు. ఆ మాటకు వస్తే.. ఆయన మాటలు ఆవేదనను చెప్పుకున్నట్లు ఉంటాయి.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలు చేసిన నేత ఇంటిపై దాడితో పాటు..రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం మొదలు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీదా.. టీడీపీ నేతల ఇళ్ల మీదా దాడి చేసిన వైనంపై సీఎం జగన్ స్పందించారు. రోటీన్ కు భిన్నంగా జగన్ స్పందన సాగినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా జగన్ మాట్లాడే వేళలో.. ఒక వాదనను అనుకొని వస్తారు. దానికి తగ్గట్లే ఆయన ప్రెస్ మీట్ సాగుతుంది. సదరు వాదనను తిప్పి కొట్టేందుకు కాస్త టైం అవసరమైనట్లుగా ఉంటుంది.

కానీ.. తాజా ప్రెస్ మీట్ మాత్రం అందుకు భిన్నంగా తేలిపోయిందని చెబుతున్నారు. సీఎం జగన్ లాంటి వారు.. తాము ఎప్పుడైనా బూతులు.. ఘాటు వ్యాఖ్యలు చేశామా? అని ప్రశ్నించటం ఏ మాత్రం సూట్ కాలేదంటున్నారు. అంతేకాదు.. బూతులు మాట్లాడామా? అన్న వెంటనే.. ఆయన పార్టీ నేతలు పలువురు చేసిన బండ బూతులు ఇట్టే గుర్తుకు వస్తాయి. అంతేనా.. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును.. కాల్చి చంపాలని.. ఊరి తీయాలన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది తానేనని.. ఈ డిజిటల్ యుగంలో అలాంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు ఇట్టే లభిస్తాయన్న విషయాన్ని జగన్ మర్చిపోవటం బాగోలేదంటున్నారు.

అంతేకాదు.. టీవీల్లో వచ్చే తిట్లు.. అసభ్యపదజాలం వినలేక మనల్ని అభిమానించేవాళ్లు.. ప్రేమించేవాళ్లు చూపించిన ప్రతిస్పందన రాష్ట్రమంతా కనిపించిందని వ్యాఖ్యానించటం సరికాదంటున్నారు. ఎందుకంటే.. ఆ వ్యాఖ్యలతోనే దాడి చేసిన వారంతా తమను అభిమానించే వారన్న విషయాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. జగన్ మాటలు అలాంటి దాడులు భవిష్యత్తులో కూడా జరిగినా తప్పేం కాదన్నట్లుగా ఉందంటున్నారు. ఈ రోజున టీడీపీ వారు తిట్టారని అభిమానులు స్పందించి తమ అభిమానాన్ని ప్రదర్శించారు సరే. రేపొద్దున వైసీపీ నేతలు తిట్టారని వారి అభిమానులు ఇదే తీరులో ‘అభిమానాన్ని’ ప్రదర్శిస్తే.. అప్పుడు కూడా ఇంతే ప్రశాంతంగా మాట్లాడతారా? అన్న ప్రశ్నలు పలువురి నోటి నుంచి వినిపిస్తున్నాయి.