Begin typing your search above and press return to search.

అమరావతికి జగన్ ప్రైవేటు టూర్ ఎందుకు?

By:  Tupaki Desk   |   12 Feb 2016 7:04 AM GMT
అమరావతికి జగన్ ప్రైవేటు టూర్ ఎందుకు?
X
అమ‌రావ‌తి..న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల‌ల‌ రాజ‌ధాని. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత‌ నారా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ - ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అంశం. మ‌రోవైపు వైసీపీ అధ్య‌క్షుడు - ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ అత్యంత ఇష్ట‌ప‌డ‌ని విష‌యం ఈ ప్ర‌జా రాజ‌ధానే. అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగిన అమ‌రావ‌తి శంకుస్థాప‌నకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ - దేశ‌విదేశీ ప్ర‌ముఖులు హాజ‌రైనప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం ఆ వేడుకకు దూరంగా ఉన్నారు. ఆయ‌న టీంను అటువైపు క‌న్నెత్తి చూడ‌కుండా చేశారు.

ఏ సంద‌ర్భంలోనైనా జ‌గ‌న్ అమ‌రావ‌తి అంటేనే త‌న‌కు సంబంధించని అంశంగా భావించేవారు. కానీ ఇపుడు అదే అమ‌రావ‌తికి జ‌గ‌న్ వెళ్లారు! అది కూడా శంకుస్థాప‌న జ‌రిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండ్రాయునిపాలెం గ్రామానికి!! పైగా ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావ‌డం కోసం కార‌ణంగా చూప‌డం మ‌రింత విశేషం. ఇంత‌కీ జ‌గ‌న్ టూర్ సంగ‌తి ఏంటంటే గుంటూరు జిల్లా పర్య‌ట‌న‌ల్లో ఉన్న వైఎస్‌ జగన్‌ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఉద్ధండ్రాయునిపాలెంలో వైసీపీ మండల యువత అధ్యక్షులు నందిగం సురేష్‌ మేనల్లుడి వివాహానికి హాజరయ్యారు. ఆ ప‌క్క‌నే ఉండే వడ్డమానులోని వైసీపీ నేత గొట్టం శివారెడ్డి కుమారుని వివాహ వేడుకలో కూడా పాల్గొన్నారు.

ఈ క్ర‌మంలోనే తుళ్లూరు మండలం రాయపూడిలో జగన్‌ ను దళితులు కలిశారు. రాజధాని - ఎక్స్‌ ప్రెస్‌ హైవేల నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను దళితులు జగన్‌ కు విన్నవించుకున్నారు. సీఎం చంద్రబాబు తాత్కాలిక‌ నివాసం దాటిన అనంతరం.. కొద్దిసేపు ఆగి అక్కడికొచ్చిన రైతులను బాగున్నారా? అని అడిగారు. ఈ క్ర‌మంలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద జగన్‌ కు ఘనస్వాగతం లభించడం విశేషం. ఇంత‌కీ జ‌గ‌న్ అమరావతిలో అడుగుపెట్ట‌డం, ప్రైవేటు కార్యక్రమాల‌కు హాజ‌ర‌వ‌డం వెన‌క ప్ర‌జ‌ల ప‌ల్స్‌ ను ప‌ట్టుకోవ‌డ‌మే కార‌ణ‌మా? ఈ విష‌యంలో వైసీపీ వ‌ర్గాలే క్లారిటీ ఇవ్వాల్సి ఉందేమో.