Begin typing your search above and press return to search.

జగన్ హామీలతో రైతుల్లో ఆశలు

By:  Tupaki Desk   |   3 Dec 2017 4:54 PM GMT
జగన్ హామీలతో రైతుల్లో ఆశలు
X
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రైతుల నుంచి ఆదరణ కనిపిస్తోంది. రైతుల సమస్యలపై నిర్మాణాత్మక ఆలోచనలు, పరిష్కారాలతో ఆయన స్పష్టత కలిగి ఉండడం... ఆచరణ సాధ్యమైనవి, రైతులకు అత్యంత ఉపయోగమైనవి హామీలు ఇస్తుండడంతో వారి నుంచి సానుకూల స్పందన వస్తోంది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న విషయంలో జగన్ చేసిన తాజా ప్రకటన రైతులను ఆకర్షిస్తోంది. పండించాక ధర ఎంతుంటుందో తెలియని స్థితిలో దారుణంగా నష్టపోతున్న రైతాంగానికి ఇకపై ఆలాంటి పరిస్థితులు రాకుండా గిట్టుబాటు ధర ఎంతన్నది ఆ పంట సాగుచేయడానికి ముందే ప్రకటిస్తామని జగన్ తెలిపారు.

తాను అధికారంలోకి వస్తే.. ప్రతి రైతు కుటుంబానికి మే, జూన్‌ నెలల్లో పంటలు వేసే ముందు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు ఎక్కడైనా చనిపోతే వైఎస్‌ఆర్ బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామన్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తికొండ నియోజక వర్గం ఎర్రగుడిలో ఆదివారం ఆయన రైతులతో ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర దక్కలేదని విమర్శించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో 7.2 శాతం అభివృద్ధి రేటు చూపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం 12 శాతం అంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిజంగా 12 శాతం అభివృద్ధి జరిగి ఉంటే.. ప్రపంచంలో మనమే అగ్రస్థానంలో ఉన్నట్లని జగన్ అన్నారు.

ప్రాజెక్టులపైనా కల్లబొల్లి మాటలు చెబుతున్నారని... పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాస్తున్నా, ఆ వివాదాన్ని పరిష్కరించడం లేదన్నారు. దీంతో 45 టీఎంసీల నీరు అందుబాటులోకి రాకుండా పోయింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్లును కమీషన్ల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరిన వైఎస్‌ జగన్‌ తాను అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.