Begin typing your search above and press return to search.

లాయ‌ర్ల‌కు జ‌గ‌న్ భారీ హామీ!

By:  Tupaki Desk   |   7 May 2018 7:52 AM GMT
లాయ‌ర్ల‌కు జ‌గ‌న్ భారీ హామీ!
X
తాను చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాల‌కు ప‌లు హామీలు ఇచ్చి.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు నిద్ర లేకుండా చేస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నోటి వెంట భారీ హామీ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. లాయ‌ర్ల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ పార్టీ.. ఏ రాజ‌కీయ అధ‌నేత ఇవ్వ‌ని రీతిలో ఇచ్చిన హామీ స‌రికొత్త‌గా ఉండ‌ట‌మే కాదు.. లాయ‌ర్ల క‌మ్యూనిటీ ఎప్ప‌టికి జ‌గ‌న్ ను మ‌ర్చిపోలేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

న్యాయ‌వాద వృత్తిలో అడుగు పెట్టిన లాయ‌ర్లు.. త‌మ వృత్తిలో నిల‌దొక్కుకోవాలంటే తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. అందులోకి కెరీర్ స్టార్టింగ్‌లో వారిని న‌మ్మి కేసులు రావ‌టం క‌ష్టం కూడా. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ల ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ జూనియ‌ర్ లాయ‌ర్ల‌కు వ‌చ్చే ఆదాయం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

స‌మాజంలో గౌర‌వానికి.. మ‌ర్యాద పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆర్థిక ఇబ్బందుల‌తో లాయ‌ర్లు స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. అలాంటి వారికి ద‌న్నుగా నిలిచేలా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ పార్టీ దృష్టిసారించ‌ని లాయ‌ర్ల వ‌ర్గానికి భారీ ఊర‌ట క‌లిగించే హామీని ఇచ్చారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. లా కోర్సు పూర్తి చేసి.. లాయ‌ర్ గా ఎన్ రోల్ మెంట్ సాధించి.. ఎన్ రోల్ చేసుకున్న ప్ర‌తి న్యాయ‌వాదికి ప్ర‌తి నెలా రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామ‌ని పేర్కొన్నారు.

అది కూడా ఏ ఆర్నెల్లో.. ఏడాది కాదు. వ‌రుస‌గా మూడేళ్ల పాటు ఈ స్టైఫండ్ ఇస్తామ‌న్నారు. దేవుడు ఆశీర్వ‌దించి.. ప్ర‌జ‌ల చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే తాను తాజాగా ఇచ్చిన హామీని అమ‌లు చేస్తాన‌ని మాట ఇచ్చారు. ప్ర‌స్తుతం 155వ రోజు పాద‌యాత్ర‌ను చేస్తున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. లాయ‌ర్లు ఆక‌స్మికంగా మ‌ర‌ణిస్తే వారి కుటుంబానికి ప్ర‌స్తుతం ఇస్తున్న రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం కాస్తా రూ.10ల‌క్ష‌లకు పెంచాల‌ని కోరుతున్నార‌ని.. త‌మ ప్ర‌భుత్వంలో ఈ ప్రాతిపాద‌న‌పై సానుకూలంగా స్పందిస్తామ‌న్నారు.

న్యాయ‌వాదుల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం రూ.100కోట్లు కేటాయించిన విష‌యాన్ని త‌న దృష్టికి కొంద‌రు తీసుకొచ్చార‌ని.. తమ ప్ర‌భుత్వం కూడా ఇదే తీరులో నిధులు కేటాయించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. హైకోర్టు నిర్మించిన త‌ర్వాత అదే ప్రాంతంలో లాయ‌ర్లు కోరుతున్నట్లుగా త‌క్కువ ధ‌ర‌కే వారికి ఇళ్ల స్థ‌లాలు అందుబాటులోకి తెచ్చి ఇస్తామ‌న్నారు. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా లాయ‌ర్ల డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించారు జ‌గ‌న్‌.

మిగిలిన వారిని ముంచిన‌ట్లే లాయ‌ర్ల‌ను కూడా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముంచేశార‌న్నారు. దేశంలో మ‌రెక్క‌డా కూడా ఈ తీరులో జ‌ర‌గ‌లేద‌న్న ఆయ‌న‌.. అడ్వ‌కేట్ల‌ను సైతం మోసం చేయ‌గ‌లిగిన గొప్ప వ్య‌క్తి ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది చంద్రబాబేన‌ని చెప్పారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జాభిమానం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

జ‌గ‌న్ రాక కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేలాది మంది ఎదురుచూడ‌ట‌మే కాదు.. ఆయ‌న‌కు త‌మ స‌మ‌స్య‌ల్ని చెప్పుకుంటూ ఆదుకోవాల‌ని కోరుతున్నారు. విన‌తిప‌త్రాలు ఇచ్చే ధోర‌ణి అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.