Begin typing your search above and press return to search.

ప్రజా సేవకుడిని.. నిరూపించుకున్న జగన్

By:  Tupaki Desk   |   2 March 2020 5:15 AM GMT
ప్రజా సేవకుడిని.. నిరూపించుకున్న జగన్
X
అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవులకు ఈ ఒకటో తారీఖు జీతం రాగానే మొత్తం ఖర్చు అయిపోతుంది. అయితే ఇదే ఒకటో తారీఖును ఏమీ పనిచేయలేని వృద్ధులు, వికలాంగులు, వింతతువులకు పింఛన్ అందుతుంది. ఈ పింఛన్ డబ్బులతోనే వారి నెల గడుస్తుంది. దాని కోసం వారంతా పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా మూడు రోజులు తిరుగుతుంటారు. ఎండలో క్యూలు కడుతూ ఆపసోపాలు పడుతూ అష్టకష్టాలు పడుతుంటారు. పింఛన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటారు.

కానీ వీరి కష్టాలను ఏపీ సీఎం జగన్ తీర్చాడు. అద్భుతమైన సంస్కరణ చేశాడు. అదే ఇంటికెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం.. జగన్ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వలంటీర్లు లబ్దిదారుల ఇంటికెళ్లి వారి పింఛన్ డబ్బులను అందజేశారు. ఈ పథకానికి ఆదివారం అద్భుతమైన స్పందన వచ్చింది.

ఏపీలోని పింఛన్ లబ్ధిదారుల్లో 80శాతం మందికి ఆదివారం ఉదయం మొదటి రెండు గంటల్లోనే పింఛన్ ను ఇంటివద్దే అందుకున్నారు. ఇదో అద్భుతమైన సంస్కరణగా.. వృద్ధులు, వికలాంగులు లబ్ధిదారులు పేర్కొన్నారు. "జగన్ మా పెద్ద కొడుకు" అంటూ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా హర్షం వ్యక్తం చేయడం కనిపించింది.

ప్రతీ నెల పింఛన్ తీసుకోవడానికి లబ్ధిదారులు ఎన్నో కష్టాలు పడేవారు. కానీ సీఎం జగన్ ఇప్పుడు లబ్ధిదారుల ఇంటికే పింఛన్ పంపిస్తున్నారు. వారి వయసుకు తగిన గౌరవం అందిస్తున్నారు. ప్రజాసేవకుడిగా నిరూపించుకుంటున్నారు. ముదిమి వయసులో వృద్ధులకు పింఛన్ ఎంతో ముఖ్యమైంది. అది ఇంటికే రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ ఒక్క పథకం చాలు.. ప్రభుత్వానికి మైలేజ్ సంపాదించిపెట్టడానికి, ఓట్లు రాల్చడానికి అని రాజకీయ విశ్లేషకులు సైతం ఘంఠాపథంగా చెబుతున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.