Begin typing your search above and press return to search.

సవినయంగా విన్నవించుకున్న క్షత్రియుల మాటపై జగన్ యాక్షన్ ఏమిటి?

By:  Tupaki Desk   |   21 Jun 2021 10:30 AM GMT
సవినయంగా విన్నవించుకున్న క్షత్రియుల మాటపై జగన్ యాక్షన్ ఏమిటి?
X
ఏపీలోని సామాజిక వర్గాలు.. వాటి మధ్య పోరు.. చెబితే భారతం.. వింటే రామాయణం అంత ఉంటుంది. ఇప్పుడీ మధ్యన తెలంగాణలో కులాల లొల్లి మొదలైంది కానీ.. గతంలో ఇలాంటి పరిస్థితి అసలు ఉండేది కాదు. తెలంగాణ సమాజానికి భిన్నంగా ఏపీలోని పరిస్థితులు ఉంటాయి. పరిచయమైన పావుగంటకే మీ కులం ఏమిటన్న ప్రశ్న రావటం అలవాటే. వేరే ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లిన వారికి.. కులం గురించి అడిగే ప్రశ్నలు షాకింగ్ గా ఉంటాయి. కులాల విషయాన్ని అలా ఉంటే.. తమ పని తాము చేసుకుంటూ ఉండే కులాల్లో క్షత్రియ కులం ఒకటి. సామాజిక వర్గంగా బలమైన ఆర్థిక దన్ను ఉన్నప్పటికి.. అనవసరమైన ఇష్యూల వైపు వెళ్లే అలవాటు వారిలో కనిపించదు.

అంతేకాదు.. తమ సామాజిక వర్గానికి చెందిన నేత ఎవరైనా తన రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడినప్పుడు.. వెనుకా ముందు చూసుకోకుండా చొక్కాలు చించుకోవటం వారిలో కనిపించదు. నరసాపురం ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు వ్యవహారాన్ని తమకు సంబంధం లేనట్లు చూశారే కానీ.. కులం యాంగిల్ లో అస్సలు చూడలేదు. రఘురామ ఎపిసోడ్ మొత్తం రాజకీయ అంశంగా చూశారు. ఈ కారణంతో వారెవరూ స్పందించింది కూడా కనిపించదు.

అలాంటిది తాజాగా మాజీ కేంద్రమంత్రి.. టీడీపీ సీనియర్ నేత విజయనగర రాజవంశీయుడు పూసపాటి అశోక్ గజపతి రాజు విషయంలో జగన్ సర్కారు తీరు వారిని వేదనకు గురి చేస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే అశోక్ గజపతి మీద ఇటీవల కొందరు నేతలు చేసిన విమర్శలు.. వ్యక్తిగతంగా ఆయన్ను సంభోదించిన తీరు వారికి కష్టంగా మారింది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఎప్పుడూ కూడా వివాదాల జోలికి వెళ్లకుండా.. తన మానాన తాను ఉండటం.. పెద్ద మనిషిగా వ్యవహరించటం లాంటివి ఉన్న ఆయన్ను వైసీపీనేతలు కొందరు టార్గెట్ చేయటం.. వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని వారు తప్పు పడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఇతర పార్టీ నేతలు ఎవరూ కూడా అశోక్ గజపతి రాజు మీద విమర్శలు చేయటానికి ముందుకు రారు. రాజకీయాలకు.. పార్టీలకు అతీతంగా ఆయన్ను గౌరవిస్తారు.. అంతకు మించి అభిమానిస్తారు.

అలాంటిది మాన్సాస్ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఖరిని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తాజాగా కొన్ని దినపత్రికల్లో వారు జగన్ సర్కారుకు వినయపూర్వక హెచ్చరికను జారీ చేశారు. ప్రకటనలో సుదీర్ఘంగా తమ వాదనను వినిపిస్తూ.. సీఎం జగన్ ఈ విషయాల్ని గుర్తించి.. చర్యలు తీసుకోవాలన్నట్లుగా పేర్కొన్నారు.

పత్రికల్లో వారిచ్చిన యాడ్ లోని ముఖ్యాంశాల్ని చూసినప్పుడు..

"రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవ‌న విధానాన్ని సాగిస్తున్న సామాజిక వ‌ర్గం క్ష‌త్రియ స‌మాజం. మాలో నూటికి 99 శాతం మంది సామాజిక, రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు చాలా దూరంగా ఉంటారు. సంస్కార విలువ‌ల కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంస్కృతి క్ష‌త్రియుల‌ది.

మా సామాజిక వ‌ర్గానికి చెందిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై రాజ్య‌స‌భ స‌భ్యులు అస‌భ్య భాష వాడిన సంఘ‌ట‌న మూలంగా మా స‌మాజంలో కొంత ఆవేద‌న నెల‌కొంది. మా క్ష‌త్రియుల‌లోని ఒక ప్ర‌ఖ్యాతిగాంచిన రాజ‌వంశానికి చెందిన, ఎన్నో ఉన్న‌త ప‌ద‌వుల‌ను అధిష్టించిన పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై సంబోధించిన విధానం చాలా అమ‌ర్యాద‌క‌రంగా ఉంది. అందువ‌ల్లే మా క్ష‌త్రియ స‌మాజం నుంచి వ్య‌క్త‌మైన భావాల‌ను మీకు (ముఖ్యమంత్రి) విన్న‌విస్తున్నాం.

ముఖ్యంగా విజ‌య‌న‌గ‌ర రాజ‌వంశానికి చెందిన పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై, మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారాల‌పైన చేస్తున్న అస‌త్య ప్ర‌చారం, మీ మంత్రి వ‌ర్గ స‌భ్యుల విమ‌ర్శ‌లు, ఆయ‌న వాడిన అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం, ఆ మంత్రిగారి స్థాయిని, మీ ప్ర‌భుత్వ స్థాయిని దిగ‌జార్చే విధంగా మాట్లాడారు. ఆ సంఘ‌ట‌న మా క్ష‌త్రియ స‌మాజాన్ని గాయ‌ప‌రిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై వాడిన భాష‌, ఒక పార్ల‌మెంట్ స‌భ్యుడి స్థాయికి వాడ‌కూడ‌ని ప‌దాలు ప్ర‌యోగించారు. ద‌య‌తో త‌మ విన్న‌పాన్ని ప‌రిశీలించి, ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధుల్లోని కొంద‌రి శృతి మించిన భాష‌ను స‌రిచేసి త‌మ క్ష‌త్రియ స‌మాజ మ‌నోభావా ల‌ను సంర‌క్షించాల్సిందిగా కోరుతున్నాం" అని పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో క్షత్రియల మనసులు ఎంతలా గాయపడ్డాయన్నది ఇట్టే అర్థమయ్యేలా ఉంది. అయితే.. ఎక్కడా కూడా విజయసాయి పేరును ప్రస్తావించకుండా.. ఆయన భాష మీద మాత్రమే తమకు అభ్యంతరం ఉందని పేర్కొనటం చూస్తే.. ఎక్కడా కూడా నొప్పించాలన్న ఉద్దేశం తమకు లేదన్న భావన కలుగుతుంది. మరి.. దీనిపై సీఎం జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.