Begin typing your search above and press return to search.

సింధు మీదున్న ప్రేమ రైతుల‌పై లేదా బాబు?

By:  Tupaki Desk   |   16 May 2017 7:17 AM GMT
సింధు మీదున్న ప్రేమ రైతుల‌పై లేదా బాబు?
X
ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ‌ళం విప్పారు. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ప్ర‌త్యేకంగా అసెంబ్లీని కొలువు తీర్చిన సంద‌ర్భంగా.. ప్ర‌భుత్వ అనుస‌రించిన వైఖ‌రిని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని మండి ప‌డ్డారు. ఏపీ అసెంబ్లీ నిర‌వధికంగా వాయిదా ప‌డిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు తీరును సునిశితంగా త‌ప్పు ప‌ట్టారు.

ఏపీ ప్ర‌భుత్వానికి క్రీడాకారిణి సింధుపై ఉన్న ప్రేమ రైతులు మీద లేద‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింధుపై అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం త‌ప్పు కాద‌ని.. కానీ.. గిట్టుబాటు ధ‌ర లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న రైతుల్ని ఆదుకునే విష‌యంలో ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌ని త‌ప్పు ప‌ట్టారు.

ముఖ్య‌మంత్రి ఘ‌నంగా చెప్పుకునే డ్యాష్ బోర్డు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. మిర్చి రైతుల్ని ఆదుకోవ‌టం కోసం ఏపీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ రూ.2కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌న్నారు. ఓవైపు గిట్టుబాటు ధ‌ర‌లు లేక మిర్చి రైతులు ఆందోళ‌న చేస్తుంటే.. మ‌రోవైపు మిర్చి యార్డుకు సెలవులు ప్ర‌క‌టించటాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి కావ‌టంతోనే.. యార్డుకు సెల‌వు ఇచ్చార‌న్నజ‌గ‌న్‌.. రైతులు స‌మ‌స్య‌ల్లో ఉంటే యార్డును మూసేస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

మిర్చికి కేంద్రం రూ.5వేలు ఇస్తాన‌న్నా బాబు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్న జగ‌న్‌.. రూ.5వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ చేస్తామ‌ని చెప్పి రైతుల్ని మోసం చేశార‌ని విమ‌ర్శించారు. రుణ‌మాఫీ విష‌యంలోనూ మాట త‌ప్పి రైతుల్ని ద‌గా చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. ఏపీ అసెంబ్లీలో రైతుల స‌మ‌స్య‌ల మీద మాట్లాడ‌దామంటే త‌ప్పించుకుంద‌న్నారు.

జీఎస్టీ బిల్లు ఆమోదం రెండు నిమిషాల ప‌ని అని.. నిజంగా మిర్చి రైతుల మీద బాబు స‌ర్కారుకు చిత్త‌శుద్ధి ఉంటే.. ఈ ఇష్యూ మీద మాట్లాడేవార‌ని.. కానీ. అలాంటిదేమీ లేకుండా స‌భ‌ను వాయిదా వేశార‌న్నారు.

అ అంటే అమ‌రావ‌తి.. అభివృద్ధి కాద‌న్న జ‌గ‌న్‌.. త‌న‌దైన శైలిలో బాబు స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. అ అంటే అవినీతి అని.. అ అంటే అరాచ‌కాల‌ని.. అ అంటే అనారోగ్యం.. అ అంటే అబ‌ద్ధాలుగా ఆయ‌న ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/