Begin typing your search above and press return to search.

ఏడు ప్ర‌శ్న‌ల‌తో బాబు నోరు మూయించిన జ‌గ‌న్ !

By:  Tupaki Desk   |   6 April 2018 5:18 PM GMT
ఏడు ప్ర‌శ్న‌ల‌తో బాబు నోరు మూయించిన జ‌గ‌న్ !
X
కొన్ని రోజుల క్రితం తుపాకిలో మీరు ఒక వార్త చ‌దివే ఉంటారు. జ‌గ‌న్ మాట‌ల్లో - చెణుక‌ల్లో తీవ్ర‌త‌ - వాడి పెరిగింద‌న్న‌ది ఆ ఆర్టిక‌ల్ సారాంశం. స‌మ‌కాలీన రాజ‌కీయ నేత‌ల్లో మంచి వ‌క్త‌గా వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మెల్ల‌గా నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని అధిరోహించార‌న్న‌ది ఆ వార్త సారాంశం. అది ఇటీవ‌ల‌ ప్ర‌తిరోజు నిరూపిస్తూ వ‌స్తున్న జ‌గ‌న్‌.... తాజాగా పేల్చిన కొన్ని ప్ర‌శ్న‌లు బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్తును సంక‌టంలో ప‌డేసేంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన‌వి.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి - ఆమరణ నిరాహారదీక్ష కు దిగిన నేప‌థ్యంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు ముసుగుల‌ను తొల‌గించారు. ప్ర‌జ‌ల ముందు 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే బాబుకు నోట మాట‌రాని ప్ర‌శ్న‌ల‌ను జ‌గ‌న్ సంధించారు.

ఆ ఏడు ప్రశ్న‌లు వివ‌రంగా వింటే...

1. ఫ్లానింగ్‌​ కమిషన్‌ కు లేఖ ఎందుకు రాయలేదు?

మార్చి 2 - 2014న అంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదాను కేబినెట్‌ తీర్మానంలో ఆమోదించింది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఫ్లానింగ్‌ కమిషన్‌ ను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. ప్లానింగ్ క‌మిష‌న్ అధ్య‌క్షుడు అపుడు మ‌న్మోహ‌న్ సింగ్‌. త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ . ఆయ‌న కూట‌మిలో చంద్రబాబు ఉన్నారు. 2014 డిసెంబర్‌ దాకా ఫ్లానింగ్‌ కమిషన్‌ అమలులో ఉంటే.... 7 నెలల పాటు అధికారంలో ఉండి చంద్ర‌బాబు ప్లానింగ్‌ కమిషన్‌ కు లేఖ ఎందుకు రాయ‌లేదు. ఎందుకు వారిని క‌ల‌వ‌లేదు? ఏపీ శ్ర‌ద్ధ ఉంటే క‌లిసేవారు కాదా?

2. ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా?

సెప్టెంబర్‌ 8 - 2016న అర్ధరాత్రి సోకాల్డ్ స్పెష‌ల్‌ ప్యాకేజీ అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేస్తే దానిని ఏపీ ముఖ్య‌మంత్రి మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తించారు. దీనికి ఏపీ ప్ర‌జ‌లంతా సాక్షి. పైగా ప్యాకేజీ ప్రకటన సమయంలో టీడీపీ మంత్రులు జైట్లీ పక్కనే ఉన్నారు. ముందు ప్యాకేజీ లీకులు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను శాంత ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. చంద్రబాబుగారూ.. మీరు ఆ ప్యాకేజీ బ్ర‌హ్మాండం... అని మీరు స్వాగతించలేదా? ఢిల్లీకి వెళ్లి జైట్లీకి శాలువా కప్పి కృతజ్ఞతలు చెప్పలేదా? సెప్టెంబర్ 9న అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు పెట్టి కేంద్రాన్ని, జైట్లీని ప్రశంసించలేదా? పైగా ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు వెటకారంగా వ్యాఖ్యలు చేయ‌లేదా... అంటే ప్ర‌త్యేక హోదాకు స‌మాధి క‌ట్టింది చంద్ర‌బాబు కాదా? ఇది ఏపీకి బాబు స్వ‌యంగా చేసిన అన్యాయం కాదా?

3. వృద్ధిరేటుపై తప్పుడు సంకేతాలు కొంప ముంచ‌లేదా?

బీజేపీతో స‌ఖ్య‌త కోసం ఏపీని తాక‌ట్టుపెట్టారు చంద్ర‌బాబు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న ఇదే పెద్ద మనిషి.. ఆ తర్వాత మాట త‌ప్పారు. ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అంటూ ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇచ్చారు‌. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల్లో ఉద్యోగాలు అంటూ తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రమంటూ చెప్పుకున్నారు. సాయం కోరే వారు ఎవ‌రైనా ఇలాంటి మాట‌లు చెబుతారా? ఇది పాల‌కుడు వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌ద్ధ‌తేనా? ఏపీకి నిధులు అడిగే విధానం ఇదేనా?

4. నాలుగేళ్లలో మీరు చేసిందేంటి?

ప్రత్యేక హోదా అంశం మీద మొద‌ట్నుంచి ఒకేమాట మీద నిల‌బ‌డిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌. వైఎస్సార్‌ సీపీ మాత్రమే నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదాను విడిచిపెట్ట‌కుండా వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తే.. పోలీసులతో ఏపీ ప్ర‌భుత్వం అణ‌చివేసింది. ఆందోళనలను నీరుగార్చింది. ప్రత్యేక హోదా లాభాలను వివ‌రించే యువభేరీ కార్యక్రమాలను దారుణంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదా? అంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఇంకా....
5. అవిశ్వాసం విషయంలో యూటర్న్ తీసుకోలేదా.
6. న‌ల్ల‌బ్యాడ్జీల‌తో హోదా ఎలా తెస్తారు?
7. ఎంపీల‌తో రాజీనామా చేయించ‌క‌పోవ‌డం మోసం కాదా?

జ‌గ‌న్ సంధించిన‌ ఈ ఏడు ప్ర‌శ్న‌లకు ఏపీ ప్ర‌జ‌లే ప్ర‌త్య‌క్ష సాక్షులు. ప్ర‌తి మీడియాలో ఇవ‌న్నీ ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఈనాటికీ బాబు చ‌ర్య‌ల‌న్నీ వీడియోలుగా యూట్యూబుల్లో నిక్షిప్త‌మై ఉన్నాయి. దీంతో ఈ ప్ర‌శ్న‌లు చంద్ర‌బాబు కొట్టేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. జ‌గ‌న్ వేసిన ఒక్కో ప్ర‌శ్న ఒక్కో బాణంలా అధికారంలో ఉన్న టీడీపీ త‌లుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లు ఈరోజు *ప్ర‌త్యేక హోదా* అనే ఒక మాట ఇంకా మిగిలి ఉందంటే... అది కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టువిడ‌వ‌ని విక్ర‌మార్కుడిలా దాని గురించి నిరంత‌రం ప్ర‌స్తావించ‌డ‌మే కార‌ణం. దాని విలువ జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంతో దానిని త‌ప్ప‌క మోయాల్సిన ప‌రిస్థితి చంద్ర‌బాబుకు వ‌చ్చింది.

* ప్రజలను నాలుగేళ్లుగా మోసం.. అన్యాయం చేస్తూ.. ఇప్పుడు సైకిల్‌​ ర్యాలీ, అఖిల పక్షం అంటూ ఇప్పటికీ ప్రజలను మభ్యపట్టే కార్యాక్రమాలకు చంద్రబాబు తెరలేపారు. ఏపికి అన్యాయం చేసినందుకు బాబు సిగ్గుతో తల దించుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడుగా చంద్రబాబు మిగిలిపోతారని చెబుతున్నార‌’ని జగన్ ఈరోజు వ్యాఖ్యానించ‌గ‌లుగుతున్నారంటే... 40 ఏళ్ల సీనియ‌ర్ ఎంత ప్ర‌త్య‌క్షంగా స‌సాక్ష్యాలతో బాబుకు దొరికిపోయారే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.