Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ ను పాయింట్ల‌తో దులిపేసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   8 Dec 2017 10:03 AM GMT
ప‌వ‌న్‌ ను పాయింట్ల‌తో దులిపేసిన జ‌గ‌న్‌
X
ఆచితూచి మాట్లాడ‌తాన‌ని చెబుతూనే.. తాను ఎవ‌రినైతే ల‌క్ష్యంగా చేసుకున్నానో.. వారిపై వ్యూహాత్మ‌కంగా బండ‌లు వేయ‌టంలో ఆరితేరిపోయారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. గ‌డిచిన మూడు రోజులుగా ఏపీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. ప్ర‌తి చిన్న విష‌యానికి ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ ను ఉద్దేశించి చేస్తున్న విమ‌ర్శ‌లు ఇప్పుడు రిట‌ర్న్ లో ప‌వ‌న్ పై వేలెత్తి చూపించేలా చేస్తున్నాయి.

త‌న‌పై ప‌వ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. పాయింట్ల వారీగా పంచ్ లు వేసిన జ‌గ‌న్.. ప‌వ‌న్ తీరుపై సందేహాలు క‌లిగేలా ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుభ‌వ రాహిత్యంతో మాట్లాడుతున్నార‌న్న జ‌గ‌న్‌.. త‌మ పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేల బృందం పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించ‌టానికి వెళుతుంద‌న్న విష‌యం తెలుసుకొని ప‌వ‌న్ కూడా అక్క‌డ‌కు వెళ్లార‌న్నారు.

సినిమాలు తీసుకుంటూ ఎక్క‌డో ఉండే ప‌వ‌న్‌.. ఏది చేసినా మూడు రోజుల హ‌డావుడిగానే ఉంటుంద‌న్నారు. వైఎస్ హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని ప‌వ‌న్ అంటున్నార‌ని.. ఆయ‌న ఆ విష‌యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశారా? అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ అప్ప‌ట్లో ఎక్క‌డ ఉన్నారు? మ‌రి.. కాంగ్రెస్ అవినీతిమ‌య‌మైతే ప్ర‌జారాజ్యం పార్టీని అందులో ఎందుకు విలీనం చేశారు? అంటూ నిల‌దీశారు.

కాంగ్రెస్ లో ప్ర‌జారాజ్యం విలీనంలో ఎంత అవినీతి జ‌రిగిందో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. రాజ‌కీయాల్లో అనుభ‌వం గురించి ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని.. మ‌రి ఏ అనుభ‌వం ఉంద‌ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టార‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన సైతం ఎన్నిక‌ల‌కు ముందే పెట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో అవినీతి జ‌రుగుతుంద‌ని అంటున్నా సీఎం చంద్ర‌బాబును.. రాష్ట్ర ప్ర‌భుత్వ అవినీతిని ఎందుకు ప్ర‌శ్నించ‌టం లేద‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు ఇవ్వ‌టం ఆపేసింద‌న్నారు. త‌మ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుండ‌గా బుర‌ద చ‌ల్లే విధంగా ప‌వ‌న్ మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ప‌వ‌న్ ను అడ్డం పెట్టుకొని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాట‌కం ఆడుతున్నార‌న్నారు. త‌మ పార్టీ అవినీతిపై పోరాటం చేస్తుంటే.. దాన్ని బుర‌ద జ‌ల్లే రీతిలో ప‌వ‌న్ మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. విశాఖ‌లోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకార‌ణ విషయాన్ని తొలుత పార్ల‌మెంటులో ప్ర‌స్తావించింది త‌మ‌పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డేన‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప‌వ‌న్ పై జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ ఏ రీతిలో రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.