Begin typing your search above and press return to search.

సీపీఎస్ రద్దు కు జగన్ ఓకే... కానీ...?

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:30 PM GMT
సీపీఎస్ రద్దు కు జగన్ ఓకే... కానీ...?
X
ఏపీలో అతి పెద్ద సెక్షన్ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వైసీపీ సర్కార్ కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇది లక్షలాది మంది ఉద్యోగులకు అతి పెద్ద గుడ్ న్యూస్ గా చెబుతున్నారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్ ఎపుడూ చెబుతూ ఉంటారు. కానీ తన పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల వ్యవధిలోనే ఆ ఫైల్ మీద సంతకం చేస్తామని జగన్ చెప్పి ఉన్నారు. కానీ మూడున్నర ఏళ్ళు అయినా ఈ సమస్య మాత్రం అలాగే ఉంది.

ఈ విషయంలో ఉద్యోగులు కరోనా కాలమంతా ప్రభుత్వానికి ఆలోచించుకునే వ్యవధి ఇచ్చి వదిలేశారు. కానీ గత కొంతకాలంగా మాత్రం వారు ఇదే అంశం మీద పట్టుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. పైగా వైసీపీ హామీ ఇచ్చిన విషయం ఇది. దాంతో తాము ఎక్కడా తగ్గకూడదని భావిస్తూ ఆందోళనలు చేస్తోంది. చలో విజయవాడ ఆందోళన ఈ ఏడాది మొదట్లో చేపట్టి వైసీపీ సర్కార్ కి గట్టి షాక్ ఇచ్చేసిన ఉద్యోగులు ఇపుడు ఏకంగా సీఎం ఇల్లు ముట్టడి అంటున్నారు.

ఈ ఆందోళన ప్రస్తుతానికి వాయిదా పడినా సమయం చూసి ఉద్యోగులు భారీ స్థాయిలో దీనికి రెడీ అవుతారని టాక్. ఇక ఉద్యోగుల సీపీఎస్ సమస్య విషయంలో ప్రభుత్వం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయాణకు బాధ్యతలు కట్టబెట్టింది. ఆయన వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం కూడా కాస్తా తగ్గి గ్యారంటీ పెన్షన్ స్కీం ని తీసుకువస్తామని చెప్పింది. దాని ప్రకారం కనీస పెన్షన్ గా పదివేల రూపాయ్లు రిటైర్డ్ అయిన ఉద్యోగికి, భార్యకు బీమా కల్పించడం, హెల్త్ కార్డులు వంటి సదుపాయాలను ఇవ్వడం వంటివి చేస్తున్నారు.

అయినా సరే ఉద్యోగులు మాత్రం తమకు ఓల్డ్ పెన్షన్ స్కీం నే అమలు చేయమని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇటీవల మంత్రి బొత్స ఒక మాట చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దు సమస్య విషయాన్ని రెండు నెలల వ్యవధిలో తేల్చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇది ఉద్యోగ వర్గాలకు సానుకూలంగానే ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు. దాంతో ఉద్యోగులు కూడా తమకు మంచే జరుగుతుందని ఆలోచిస్తున్నారుట.

ఇవన్నీ ఇలా ఉంటే సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం ఇపుడు మరో అడుగు ముందుకేసినట్లుగా చెబుతున్నారు. సీపీఎస్ రద్దుకు ఓకే చెబుతూనే అది కొన్ని కండిషన్ల మేరకు అమలు చేయాలని భావిస్తోందని అంటున్నారు అంటే 2004 సెప్టెంబర్ 1 నాటికి ఎవరైతే ఉద్యోగులుగా ప్రభుత్వ సర్వీసుల్లో చేరారో వారందరికీ పాత పెన్షన్ అమలు చేయలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు. ఆ ఉద్యోగుల వివరాలు అన్నీ కూడా పంపాలని ఇపుడు అర్ధిక శాఖ వివిధ విభాగాలను కోరింది అని అంటున్నారు.

ఈ సంఖ్యను బట్టి ప్రభుత్వం ఆర్ధిక భారాన్ని బేరీజు వేసుకుని వీరందరికీ పాత పెన్షన్ ని అమలు చేస్తుందని చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత ఆర్ధిక ఉపశమనం కలుగుతుందని, అదే సమయంలో సీపీఎస్ రద్దు చేశామన్న పేరు వస్తుందని ఆలోచిస్తున్నారు. ఇక సీపీఎస్ రద్దు కోరుతున్న వారిలో అత్యధికులు ఈ కటాఫ్ డేట్ కి ముందర ఉన్నవారే అని కూడా ప్రభుత్వ వర్గాలకు అందుతున్న సమాచారమట. దాంతో వీరికి అమలు చేస్తే మిగిలిన వారు ఎటూ కొత్త పెన్షన్ విధానానికి కట్టుబడే సర్వీసులో చేరారు కాబట్టి వారు ఆ విధంగానే న్యూ పెన్షన్ తీసుకుంటారని కూడా లెక్కలేస్తోందిట.

ఇక అత్యధిక శాతం ఉద్యోగులకు కూడా ఈ ప్రతిపాదన నచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ఇపుడు ఆర్ధిక శాఖ వివరాలు సేకరించే పనుల్లో బిజీగా ఉందని చెబుతున్నారు. ఒక్కసారి ఈ లెక్కలు తేలి. ప్రభుత్వానికి ఒక కచ్చితమైన ఫిగర్ అన్నది చేరితే దాన్ని ముందర పెట్టుకుని ఉద్యోగులతో జరిపే అతి కీలకమైన చర్చలలోనే సీపీఎస్ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు అని అంటున్నారు.

అయితే సీపీఎస్ రద్దు అని దీన్ని అనవచ్చా లేక పాక్షిక రద్దు అని చెప్పాలా అన్నది కూడా ఒక మాట ఉంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికలు, ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఇలా చేస్తోంది అని అంటున్నారు. అయితే ఇక్కడో చిక్కు ఉంది. ఒకసారి కటాఫ్ డేట్ కి ముందర వాళ్ళకు సీపీస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తే 2004 సెప్టెంబర్ 1 తరువాత చేరిన వారు కూడా తమకు అదే కావాలని డిమాండ్ చేస్తారని అంటున్నారు. అపుడు సర్కార్ ఏం చేస్తుంది అన్నది కూడా పాయింటే మరి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.