Begin typing your search above and press return to search.

'అమరావతి అక్రమాల'పై జగన్ ప్రభుత్వ నివేదిక రెడీ?

By:  Tupaki Desk   |   17 Oct 2019 2:30 PM GMT
అమరావతి అక్రమాలపై జగన్ ప్రభుత్వ నివేదిక రెడీ?
X
గత ప్రభుత్వ హాయాంలోనే అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఆ మేరకు వివిధ అంశాలను తెర మీదకు తెచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా? అనే నీలినీడలు కూడా నెలకొన్నాయి. అయితే రాజధానిని మార్చే ఉద్దేశం తమకు లేదని జగన్ మొదటే చెప్పారు. అయితే అమరావతి విషయంలో జరిగిన అక్రమాలను బయటకు తీసుకురావడానికి మాత్రం జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అందులో భాగంగా.. ఆ విషయంపై విచారణ కోసం ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక రెడీ అయ్యిందని సమాచారం. అది త్వరలోనే ముఖ్యమంత్రికి అందబోతోందట. అందులో భాగంగా ఆ నివేదికలో పేర్కొన్న పలు అంశాలపై ప్రచారం మొదలైంది.

రాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ అనడానికి పలు ఆధారాలు లభించాయని టాక్. అందులో ముఖ్యమైనది ఏమిటంటే..రాజధాని ఏరియాలో నిర్మాణాలకు చదరపు అడుగుకు పది వేల రూపాయల కేటాయించడం పెద్ద స్కామ్ అని నివేదికలో పేర్కొన్నారట. దేశంలో ఎక్కడా ఆ స్థాయిలో డబ్బులు చెల్లించింది లేదని, హైదరాబాద్, బెంగళూరులో.. స్థలం విలువతో కలుపుకున్నా.. నిర్మాణానికి చదరపు అడుగుకు ఐదు వేల రూపాయల మొత్తం ఖర్చు లేదని నివేదికలో పేర్కొన్నారట.

అయితే దేశంలో ఎక్కడా లేని రీతిలో చదరుపు అడుగుకు పది వేల రూపాయలను కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల విషయంలో ధారాళంగా వ్యవహరించిందని నివేదికలో పేర్కొన్నారని టాక్. రాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ అని చెప్పడానికి ఇది కీలక ఆధారంగా పేర్కొంటున్నారట.

ఇక డిజైన్లకు అంటూ కొన్ని వందల కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందట. ఆ డబ్బును ఖర్చు పెడితే.. డైరెక్టుగా మంచి మంచి భవనాలను కట్టవచ్చని, అయితే చంద్రబాబు ప్రభుత్వం డిజైన్లకే వందల కోట్లరూపాయల ప్రజాధనాన్ని పోసిందని నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు నివేదిక రెడీ అయ్యిందని, అది ముఖ్యమంత్రిని చేరిన తర్వాత పూర్తి వివరాలు బయటకు రాబోతున్నట్టుగా సమాచారం!