Begin typing your search above and press return to search.

సంచలనం - రాజధాని పేరు మారనుందా?

By:  Tupaki Desk   |   26 Jun 2019 1:06 PM GMT
సంచలనం - రాజధాని పేరు మారనుందా?
X
జగన్ ప్రతిరోజూ కొత్త సంచలనాలతో ఏపీ ప్రజలనే కాకుండా అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే, ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలే సంచలనం అనుకుంటూ ఉంటే... మరో సంచలన నిర్ణయానికి జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతి పేరు మార్చి 33 వేల ఎకరాలను కుదించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తక్కువ ప్రాంతంలో అవసరమైన భవనాలు మాత్రమే ఏర్పాటుచేసి పరిపాలనపై ప్రధాన దృష్టిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా దీనిపై ఓ హింట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం చంద్రబాబు నివాసమైన లింగమనేనిన గెస్ట్ హౌస్ కు అప్పట్లో రోడ్డు కోసం శేషగిరి రావు అనే రైతు దగ్గర నుండి 10 అడుగుల భూమిని సేకరించారు. ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా ఇచ్చిన ఆర్డరులోనే రోడ్డు కోసం తీసుకున్న రైతు భూమిని ఆ రైతుకు తిరిగి ఇవ్వాలని అందులోనే ప్రస్తావించారు. ఈ రైతుతో అమరావతి భూముల తిరిగి అప్పగింత మొదలైనట్లే అనుకోవాలి.

పలువురు ఇతర రైతులు కూడా రోడ్డు కోసం సేకరించిన మా భూములను తమకు తిరిగి అప్పగించాలని కోరారు. ఆ వినతిని ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఈ భూములన్నీ వారికి తిరిగి ఇచ్చే మాజీ సీఎం ఇంటికి వెళ్లే రోడ్డును పాత సైజుకు కుదించే అవకాశాలున్నాయి. ప్రజావేదికతో పాటు కరకట్టపై ఉన్న అనేక భవనాలకు నోటీసులు ఇచ్చారు. వాటిలో మాజీ సీఎం ఇల్లు ఒకటి.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గతంలో నేను అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తారని ప్రకటించిన జగన్ అనుకున్నట్లే చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అనధికారికంగా వినిపిస్తున్న మరో విషయం ఏంటంటే... ఏపీ రాజధాని పేరు - ఏరియా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారట. అయితే, ముందుగా ప్రచారం అయినట్టు దొనకొండకు కాకుండా అమరావతి ప్రాంతంలో కొంత భాగమైన త గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అంటున్నారు.

అయితే, ఇది అంత సులువైన పని కాదు. రాజధాని మార్పు కేవలం రాష్ట్రం చేతుల్లో ఉండదు. అది ఒక పెద్ద ప్రక్రియ. కేంద్రం మాత్రమే పూర్తిచేయగలిగిన ప్రక్రియ. దానికి ప్రత్యేకంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక రాజధానిని అంత సులువుగా మార్చడానికి కేంద్రం ఒప్పుకుంటుందా అన్నది అనుమానమే. కాకపోతే ఏపీ ముఖ్యమంత్రి అనుకూల ప్రభుత్వం కేంద్రంలో ఉండటం వల్ల సాధ్యం కావచ్చేమో చెప్పలేం.