Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్ నుంచి ఆ మంత్రిలిద్దరూ ఔట్?

By:  Tupaki Desk   |   27 Aug 2019 2:30 PM GMT
జగన్ కేబినెట్ నుంచి ఆ మంత్రిలిద్దరూ ఔట్?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను క్యాబినెట్ ను ఏర్పాటు చేసినప్పుడు రెండున్నరేళ్ల టైమ్ పిరియడ్ అనే గడువును పెట్టారు. పాతిక మందికి కేబినెట్లో అవకాశం ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి వారికి రెండున్నరేళ్లు మాత్రమే అవకాశం అని చెప్పారు. పాలన కాలంలో సగం పూర్తి అయిన తర్వాత కేబినెట్ పునర్వ్యస్థీకరణ ఉంటుందని.. ఎనభై శాతం మంది మంత్రులు అప్పుడు మారతారు అని జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.

ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారి స్థానంలో వేరే వాళ్లు వస్తారని జగన్ తేల్చి చెప్పారు. అలా ప్రస్తుత మంత్రులకు జగన్ పెట్టిన గడువు రెండున్నరేళ్లు. ఇలాంటి నేపథ్యంలో అప్పటి వరకూ మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చు అనే అంతా అనుకున్నారు. అయితే కొందరు మంత్రులు మాత్రం తమ పని తీరుతో జగన్ కు ఇబ్బందిగా మారుతున్నారని సమాచారం. వారిలో ఇద్దరిపై వేటు పడటం ఖాయమనే ప్రచారం సాగుతూ ఉంది.

వారిలో ఒకరు సీనియర్ మంత్రి కాగా - మరొకరు జూనియర్ మంత్రి. సీనియర్ అనే గౌరవంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకు జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యతను ఇచ్చారు. మంత్రి హోదాను ఇచ్చారు. అయితే ఆయన మాత్రం తన తీరుతో జగన్ కు ఇబ్బందులు తెస్తూ ఉన్నారు. ఏకపక్ష ప్రకటనలతో ఆయన ప్రత్యర్థులకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. దీంతో ఆయనను పక్కన పెట్టాలనే భావనకు వచ్చారట జగన్ మోహన్ రెడ్డి.

ఇక ఒక జూనియర్ పొలిటీషియన్ కు జగన్ మోహన్ రెడ్డి కీలక పదవిని ఇచ్చారు. లేడీ అయిన ఆ పొలిటీషియన్ కు అలాంటి శాఖ దక్కుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అలా ప్రాధాన్యత ఉన్న మంత్రి పదవి దక్కింది ఆమెకు. అయితే ఆమె అందుకు తగ్గస్థాయిలో పని చేయలేకపోతున్నారని జగన్ కు స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె శాఖలో సమన్వయం కోసం మరో వ్యక్తిని కూడా జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అయినా పనితీరు మెరుగుపడకపోవడంతో.. ఆమెను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారట జగన్ మోహన్ రెడ్డి.