Begin typing your search above and press return to search.

సోనియాను ఎదిరించిన జగన్.. మోడీని కూడా?

By:  Tupaki Desk   |   20 Aug 2019 7:09 AM GMT
సోనియాను ఎదిరించిన జగన్.. మోడీని కూడా?
X
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన వివాదాలు మొదలవుతున్న దాఖాలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి కేంద్రం నుంచి రెడ్ సిగ్నల్ వచ్చింది. విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారంగా మారాయని జగన్ ప్రభుత్వం అంటోంది. గతంలో కమిషన్లు తీసుకుని ఖజనాపై భారం పడేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారని - ఆ భారం ముందు ముందు కూడా మోయాల్సి ఉందని - దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారం భారంగా మారుతుందని జగన్ ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

ఈ అంశంపై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు కూడా. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు ముందుగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ ఒప్పందాల సమీక్షను తెలుగుదేశం వాళ్లు వ్యతిరేకించారు. ఆ తర్వాత ఈ అంశంపై కేంద్రం కూడా స్పందించింది. సమీక్ష అనవసరమని తేల్చింది.

అయినా బరువు రాష్ట్ర ప్రభుత్వ ఖజనాపై అయినప్పుడు కేంద్రం ఆ సమీక్షలను ఎందుకు వద్దుంటుంది? అనేది కీలకమైన పాయింట్. దాని వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని కూడా కేంద్రం నుంచి వారింపు వచ్చిందట! అది మరో ప్రహసనం. అక్రమాల పై సమీక్షలు జరిగితే పెట్టుబడులు రాకుండా పోతాయనేది ఎంత వరకూ రైటో కేంద్రానికి తెలియాలి.

ఇక పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా కేంద్రం నుంచి భిన్నస్వరమే వినిపిస్తూ ఉంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని, పెరిగిన అంచనా వ్యయాలు తగ్గుతాయని జగన్ ప్రభుత్వం చెబుతూ ఉంది. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎందుకు రివర్స్ టెండరింగ్ కు పిలిచినట్టో తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరుతూ ఉంది.

ఇది కేంద్ర స్పాన్సర్డ్ ప్రాజెక్టు కాబట్టి అడగవచ్చు. అయితే ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుంది? అనేది మాత్రం అత్యంత కీలకమైన అంశం. ఒకవేళ రివర్స్ టెండరింగ్ ను కేంద్రం వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు సర్కారు హయాంలో చోటు చేసుకున్న వ్యవహారాలను సమర్థించినట్టే. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని బీజేపీ నేతలే ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వారే గత ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలికితే.. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కామ్ గా ఉండకపోవచ్చు.

గతంలో ఎలాంటి అధికారం - పదవీ లేనప్పుడు సోనియాను ఎదుర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారం ఉన్న నేపథ్యంలో మొత్తం వ్యవహారాలను జగన్ ప్రజల ముందుకు తీసుకురావొచ్చు.