Begin typing your search above and press return to search.

సెలెక్ట్ కమిటీ లో వీళ్లేనా కమిటీ సభ్యులు?

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:16 AM GMT
సెలెక్ట్ కమిటీ లో వీళ్లేనా కమిటీ సభ్యులు?
X
మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీలో ఆమోదించి.. మండలికి పంపటం తెలిసిందే. అయితే.. అక్కడ చోటు చేసుకున్న హైడ్రామాతో.. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటం తెలిసిందే. అధికారపక్ష అభిమతానికి వ్యతిరేకంగా సాగిన దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మండలిలో అధికారపార్టీకి బలం లేనప్పటికీ.. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న వాదన కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.

మరి.. ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడని రీతిలో సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపాలన్న మండలి ఛైర్మన్ నిర్ణయానికి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మండలి చైర్మన్ తీసుకున్న సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి పంచ్ ఇచ్చేలా ప్రభుత్వం పావులు కదపటం ఖాయమని చెబుతున్నారు.

కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం సెలెక్ట్ కమిటీ రిపోర్టుతో సంబంధం లేకుండా ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయం మీదనే కొనసాగేలా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. అదెలా అంటే.. మరెవరితోనూ సంబంధం లేకుండా ఆర్డినెన్స్ జారీ చేయొచ్చని చెబుతున్నారు.

అయితే.. ఏదైనా అంశంపై ఆర్డినెన్స్ జారీ చేయాలంటే ముందు చట్టసభల్ని ప్రోరోగ్ చేయాలి. ఆ తర్వాత గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్సు జారీ చేసేయొచ్చు. అయితే.. ఆర్డినెన్స్ ఆర్నెల్ల వ్యవధిలో బిల్లు రూపంలో మార్చి.. అసెంబ్లీ.. మండలిలో ఆమోదం పొందేలా చేయాల్సి ఉంటుంది. మరి.. ఈ విధానాన్ని జగన్ అనుసరిస్తారా? లేదంటే సెలెక్ట్ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత.. వారి సూచనల్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళతారా? అన్నది క్వశ్చన్ గా మారింది.

ఇదేమీ లేకుండా.. జగన్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసే అవకాశం లేకపోలేదు. తొలుత మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. మండలి చికాకును శాశ్వితంగా పరిష్కరించుకునే వీలుంది. అదే జరిగితే.. మండలి రద్దు తర్వాత.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆర్డినెన్స్ రూపంలో వెలువరిస్తారు. ఆర్నెల్ల వ్యవధిలో అసెంబ్లీని కాల్ చేసి.. తమకు తిరుగులేని అధిక్యత ఉన్న నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేలా చేయొచ్చు. అప్పుడు మండలి అన్నది ఉండని నేపథ్యంలో ఇంకెవరూ జగన్ నిర్ణయాన్ని ఆపే అవకాశం ఉండదు. ఈ ఆప్షన్లలో జగన్ దేన్ని ఎంచుకుంటారో చూడాలి?