Begin typing your search above and press return to search.

ఆ హామీ ఇచ్చి జ‌గ‌న్ పెద్ద సాహ‌స‌మే చేశారా?

By:  Tupaki Desk   |   11 July 2019 4:56 AM GMT
ఆ హామీ ఇచ్చి జ‌గ‌న్ పెద్ద సాహ‌స‌మే చేశారా?
X
త‌న మాట‌ల‌తో విప‌క్షాల‌ను ఉతికి ఆరేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం అసెంబ్లీ స‌మావేశాల్ని వీలైనంత వేగంగా ముగించేందుకే మ‌క్కువ చూపుతుంటారు. మాట వ‌ర‌స‌కు మాత్రం.. ఎన్ని రోజులైనా స‌రే అంటూనే.. కొద్ది రోజులు మాత్ర‌మే అసెంబ్లీ సాగేలా చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. నిజానికి ఇలాంటి అల‌వాటు ఒక్క కేసీఆర్ కు మాత్ర‌మే కాదు.. ఏ ముఖ్య‌మంత్రి అయినా అంత త్వ‌ర‌గా అసెంబ్లీ స‌మావేశాలు అదే ప‌నిగా సాగ‌టానికి పెద్ద‌గా ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శించ‌రు.

అసెంబ్లీ స‌మావేశాల్ని వీలైనంత త్వ‌ర‌గా ముగించ‌టంతో పాటు.. ఇబ్బందిక‌రంగా ఉండే అంశాల్ని చ‌ర్చ వ‌ర‌కు రానివ్వ‌కుండా అధికార‌ప‌క్షం ప్ర‌య‌త్నిస్తుంటుంది. ఇందుకోసం గిలెటిన్ అయ్యేలా చేస్తుండ‌టం మామూలే. అందుకు భిన్నంగా జ‌గ‌న్ ఊహించ‌ని రీతిలో ఇచ్చిన హామీ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్ని విస్మ‌యానికి గురి చేస్తోంది.

అసెంబ్లీని ఎన్ని రోజులైనా.. ఎంత స‌మ‌య‌మైనా.. ఏ అంశంపై నైనా స‌రే చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌తి సందేహానికి స‌మాధానాలు చెబుతాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏ ఒక్క అంశాన్ని వ‌దిలిపెట్టేది లేద‌న్న ఆయ‌న‌.. మ‌రో కీల‌క‌మైన హామీని ఇచ్చారు. స‌భ‌లో ఏ ఒక్క బిల్లును గిలెటిన్ కానివ్వ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిజానికి ఇంత ధైర్యంగా ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవ‌రూ కూడా ఇలాంటి హామీని ఇచ్చింది లేద‌ని చెప్పాలి.

ప్ర‌తి బిల్లును చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేస్తాన‌ని హామీ ఇవ్వ‌టం అంత తేలికైన విష‌యం కాదు. త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కంతో పాటు.. నిజాయితీగా ప్ర‌జాస‌మస్య‌ల్ని ప‌రిష్క‌రించాలన్న ఆలోచ‌న‌లో ఉన్న ప్ర‌భుత్వం ఏదీ కూడా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయ‌దు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరు చూసినా.. ఆయ‌న‌ మాట‌ల్ని చూసినా.. ఏదో చేయాల‌న్న త‌ప‌న కొట్టొచ్చినట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏ ఒక్క బిల్లును గిలెటిన్ కాకుండా చూస్తాన‌న్న హామీ అంత తేలికైన విష‌యంకాద‌ని..అందుకు ఎంతో ధైర్యం ఉండాల‌న్న మాట వినిపిస్తోంది.