Begin typing your search above and press return to search.

బిందెలు, కాగడాలు సిద్ధం చేసుకుంటున్న జగన్

By:  Tupaki Desk   |   19 April 2016 1:53 PM GMT
బిందెలు, కాగడాలు సిద్ధం చేసుకుంటున్న జగన్
X
వైసీపీ అధినేత జగన్ ఏపీ ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. తమ ఎమ్మెల్యేలను టీడీపీ ఎగరేసుకుని పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ ఉన్నవారినైనా కాపాడుకోవాలని... ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో కొత్త కార్యాచరణకు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో కరవును చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదంటూ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇందుకు వచ్చే నెల 2న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ వర్గాలకు వైకాపా అధినేత జగన్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం - జిల్లా పార్టీ అధ్యక్షులు - ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పలు అంశాలను చర్చించారు. తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో ప్రదర్శలు చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా ఈ నెల 25న కాగడాల ర్యాలీ చేయాలని తెలిపారు. ఆపై మే తొలి వారంలో ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సవరించాలని ప్రధానిని జగన్ కోరనున్నట్టు వైకాపా వర్గాలు తెలిపాయి.

మరోవైపు జగన్ తన తల్లి - వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెను కలిశారు. విజయమ్మ 60వ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ ఉదయం ఇంట్లోనే జరిగిన వేడుకల్లో తల్లికి శుభాకాంక్షలు చెప్పిన జగన్ - ఆమెకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా తల్లి ఆశీర్వచనం తీసుకున్న ఆయన, ఆ చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'మా అమ్మ 60వ పుట్టినరోజును ఇలా జరుపుకున్నాం' అని క్యాప్షన్ కూడా పెట్టారు.