Begin typing your search above and press return to search.

నవరత్నాలపై జగన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   26 July 2019 4:48 AM GMT
నవరత్నాలపై జగన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉంది?
X
నవరత్నాల అమలుపైనే తన పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు సార్లు ప్రకటించారు. ఆ మేరకు బడ్జెట్ లో కూడా అదే రకంగా కేటాయింపులు చేశారు. ఇక పాలనలో కూడా నవరత్నా అమలుకే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు.

అందులో భాగంగా ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి కార్యాచరణ కొంత వరకూ అమలు పెట్టారు - పెడుతున్నారు. ఇంతలోనే ఇప్పటి వరకూ నవరత్నాల గురించి జనాలు ఏమనుకుంటున్నారనే అంశం గురించి ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారట ముఖ్యమంత్రి.

ఈ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోందని సమాచారం. తనకు నిజాయితీతో కూడిన రిపోర్ట్ కావాలి, పూర్తి వాస్తవ సమాచారం కావాలని జగన్ మోహన్ రెడ్డి కోరగా.. ప్రజల్లో ఈ విషయంపై మిశ్రమ స్పందన వుందని సమాచారం ఇచ్చిందట ఇంటెలిజెన్స్.

వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల రూపాయలు అవుతాయని కొంతమంది అనుకున్నారని - రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెరగడంతో వాళ్లు కొంత నిరుత్సాహ పడ్డారని ఇంటెలిజెన్స్ పేర్కొందట. అయితే ఎంతో కొంత పెరగడం - ముందు ముందు అయినా మూడు వేలు అవుతుందనేది కాస్త పాజిటివ్ రియాక్షన్ అని చెప్పిందట నిఘా విభాగం.

ఇక రైతులు కూడా పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని అనుకున్నారని - అయితే కేంద్రం ఇచ్చేదాంతో కలిపి పెట్టుబడి సాయం వస్తుందనేది కూడా వారిని నిరాశ పరిచిన అంశమే అని తెలుస్తోంది. అయితే ఒకేసారి పన్నెండు వేల ఐదు వందలు రైతులకు ఇవ్వడం మాత్రం కొద్దో గొప్పో సానుకూలాంశం అవుతుంది.

ఇక మద్యాపాన నిషేధంపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట. మద్యపానాన్ని నిషేధిస్తే పక్క రాష్ట్రాల నుంచి దొంగ మద్యం వచ్చి కొత్త మాఫియా తయారవుతుందేమో - లేకపోతే మళ్లీ సారా బట్టీలు వచ్చి పల్లెల్లో సారా విక్రయం పెరుగుతుందేమో అనే భయాందోళనలు ఉన్నాయట ప్రజల్లో. ఈ మేరకు నిఘా విభాగం నుంచి జగన్ మోహన్ రెడ్డికి నివేదికలు వెళ్లినట్టుగా సమాచారం!