Begin typing your search above and press return to search.

చంద్రబాబు సీఎంగా ఉండడం మన కర్మ: జగన్

By:  Tupaki Desk   |   9 Feb 2019 4:54 PM GMT
చంద్రబాబు సీఎంగా ఉండడం మన కర్మ: జగన్
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో తెలుగుదేశం పార్టీ రహస్యంగా సర్వేలు చేసి తమకు ఓటేయరు అనుకున్నవారి ఓట్లను తొలగిస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్‌ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా జరిగేలా చూడాలని ఆ లేఖలో ఆయన గవర్నరును కోరారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ ఎలా దుర్వినియోగం చేస్తుందో కూడా అందులో ఆయన వివరించారు.

హైదరాబాద్ లో గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేసిన తరువాత జగన్ ఆ వివరాలను వెల్లడించారు. గవర్నర్ తో గంటకు పైగా భేటీ అయ్యామని - సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని - పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాను నీరు గారుస్తూ - హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ చంద్రబాబు నాడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘హోదా సంజీవినా’ అన్న చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారని - ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్రంలోని టీడీపీ మంత్రులు - ఎంపీలు పాకులాడారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు - ఏ రోజూ హోదా గురించి అడగలేదని.. అలాంటిది ఇప్పుడు దిల్లీలో ఆయన దీక్షకు దిగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.