Begin typing your search above and press return to search.

గడప గడప.. మొక్కుబడా? జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్

By:  Tupaki Desk   |   9 Jun 2022 9:30 AM GMT
గడప గడప.. మొక్కుబడా? జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్
X
ప్రభుత్వం ప్రజల మధ్యనే ఉందనిపించేలా.. ఏపీ సర్కారు రూపొందించిన కార్యక్రమమే ''గడప గడప మన ప్రభుత్వం''. ఈ పథకం మొదలుపెట్టి సరిగ్గా ఈ నెల 11కు నెల రోజులు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలంతా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలతో సంభాషించాలి. దీనిని సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ప్రజల్లోకి వెళ్లారు? ఎంతమందితో మాట్లాడారు? తదితర వివరాలన్నీ తెలుసుకుంటోంది.

కొన్నిచోట్ల ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. అయితే, అది వేరే విషయం. ఈ నేపథ్యంలో బుధవారం వర్క్ షాప్ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కొందరి పనితీరుపై తీవ్రంగా స్పందించారు. 'గడప గడపకు 'పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జులతో క్యాంప్ ఆఫీసులో సీఎం సమీక్షించారు. 'పనితీరు బాగు చేసుకుంటూ మీరు ముందుకెళ్లాలి.

లేదంటే ఆర్నెల్ల తర్వాత మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది'అంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులతో స్పష్టం చేశారు. గడప గడపలో నెలకు 20 రోజులు తిరగాలంటూ నిర్దేశించారు. ముఖ్యమంత్రిగా తన పనితీరును బాగుందనే నివేదికలు వస్తున్నాయని.. ప్రభుత్వం పనితీరు కూడా సక్రమంగా ఉందనే తేలిందని.. కానీ చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్‌ బాగా తక్కువగా ఉందని పేర్కొనడం గమనార్హం.ప్రజల్లో ఉంటూ మీ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. తిరగలేము, చేయలేమని అనేవారు.. ఆ విషయాన్ని చెప్పేయాలని కుండబద్దలు కొట్టారు. తిరిగి పనిచేసే వారినే నియమిస్తానని అన్నారు. మళ్లీ మనం ప్రభుత్వంలోకి వచ్చాక మీకు ఏదైనా చేద్దాం అని కూడా అభయమిచ్చారు.

ఆ ఏడుగురు గడప దాటలే..

గడప గడప ఉద్దేశం.. ప్రజా ప్రతినిధులు ప్రజల్లో ఉండడం. అయితే , చాలామంది ఎమ్మెల్యేలు దీన్ని పట్టించుకోవడం లేదని జగన్ ప్రోగ్రెస్ రిపోర్టులో తేలింది. ఎమ్మెల్యేలు ఏ రోజు ఏ గ్రామానికి, ఏ ఇంటికి వెళ్లారు? ప్రజలు ఏం అడిగారు? ఏ సమాధానం చెప్పారు వంటి సమాచారమంతా సీఎం దగ్గర ఉంది. రోజూ వారి పర్యటనలకు సంబంధించి అన్ని అంశాలూ జగన్ వద్దకు చేరాయి.

28 రోజుల కార్యక్రమంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా తిరగకపోవడం గమనార్హం.45 శాతం ఎమ్మెల్యేలు 10 రోజుల్లోపే.. వైసీపీకి ఉన్న 151 పైబడిన ఎమ్మెల్యేల్లో దాదాపు 65 మంది 10 రోజుల్లోపే తిరిగారు. అంటే అసలు తిరగని ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 45 శాతం మంది 28 రోజుల్లో 10 రోజులే తిరిగారు. ఇక 20 రోజులకు పైన తిరిగిన ఎమ్మెల్యే సంఖ్య కూడా ఏక సంఖ్యలోనే ఉంది. దీంతో జగన్ కు చిర్రెత్తింది. ఇదేం తీరంటూ ఆయన సమీక్ష సందర్భంగా మండిపడ్డారు.

''పనితీరు మెరుగుపడేదెలా? మొదటి నెల కాబట్టి క్షమిస్తున్నా'' అంటూ వదిలేశారు. మున్ముందు సహించేది లేదని కుండబద్ధలు కొట్టారు. ఆర్నెల్ల తర్వాత పూర్తిస్థాయి సమీక్ష చేసి పనితీరు బాగాలేని వారిస్థానంలో కొత్త ఇన్‌ఛార్జులను నియమిస్తానని హెచ్చరించారు. కుటుంబ సభ్యులను తిప్పితే చెల్లదు ''గడప గడపకూ కార్యక్రమంలో మీ (ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు) కుటుంబ సభ్యులను తిప్పితే దాన్ని లెక్కలోకి తీసుకోం, మీరే నెలలో కనీసం 20 రోజులపాటు తిరగాల్సిందే' అని సీఎం జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఎవరు ఎన్నిరోజులు తిరిగారంటే..

గడప గడపకూ కార్యక్రమంలో ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు తిరిగారనే వివరాలను ప్రభుత్వ ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడించినట్లు తెలిసింది. ఏలూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, కావలి, కోవూరు, మైలవరం, శ్రీశైలం ఎమ్మెల్యేలు అసలు తిరగలేదని తెలిపినట్లు సమాచారం. చీఫ్‌విప్‌ ప్రసాదరాజు 21 రోజులు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 20 రోజులు ఇలా అతి కొద్దిమందే 15-20 రోజులపాటు తిరిగినట్లు వివరించారని సమాచారం.

పులివెందులకు మినహాయింపు!

'పులివెందుల, చీపురుపల్లి నియోజకవర్గాలకు గడప గడపకు కార్యక్రమం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉన్నారు' అని సమావేశానంతరం బయటకొచ్చిన ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది.