Begin typing your search above and press return to search.
ఆంధ్రుల ఆకాంక్షకు సహకరించండి: జగన్
By: Tupaki Desk | 20 March 2018 9:20 AM GMTఓవైపు పాదయాత్ర కొనసాగిస్తూనే మరోవైపు ప్రత్యేక హోదా పోరాటాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి సహకరించాలని అన్ని పార్టీలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన సందర్భంగా నాడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, నేటికీ ఇవ్వక పోవడం వల్లే ఆందోళనలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇతర పార్టీల సమస్యలను కూడా అర్థం చేసుకున్నామని కానీ ఏపీకి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని జగన్ పేర్కొన్నారు. ఆటంకం లేకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
కాగా, ఈ రోజు కూడా సభ్యులు సహకరించకపోవడంతో సభ వాయిదా పడింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రజల సమస్యపై లోక్ సభలో మాట్లాడేందుకు సహకరించండి అని టీఆర్ ఎస్ - ఏఐడీఎంకే సభ్యులను చేతులు జోడించి నమస్కరించామన్నారు. స్పీకర్ అవిశ్వాస తీర్మానం చదివినప్పుడు రెండు నిమిషాలు సహకరించాలని సభ్యులను కోరడం జరిగిందన్నారు. అయితే సభ్యులు సహకరించకపోవడంతో లోక్ సభ వాయిదా పడిందని పేర్కొంటూ అయినా తమ హోదా పోరాటం ఆగదన్నారు.
లోక్ సభ వాయిదా అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ఎన్ డీఏ ఘోరమైన అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ హక్కు అని - దాన్ని సాధించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. మరోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. ఇవాళ ఉదయం కూడా స్పీకర్ ను కలిశామని చెప్పారు. ఏపీ ఘోరంగా నష్టపోయిందని - ప్రజలు వంచింపబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మొదటి నుంచి కూడా కేంద్రం చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరారని చెప్పారు. వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని - రాష్ట్రపతి - ప్రధాని - కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువభేరిల ద్వారా యువతను చైతన్యవంతం చేశారన్నారు.
చంద్రబాబు ప్రత్యేక హోదాపై అనేక సార్లు మాటలు మార్చారన్నారు. తాజాగా యూటర్న్ తీసుకొని పార్లమెంట్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు.