Begin typing your search above and press return to search.

అమిత్ షాతో జగన్ భేటీ..చంద్రబాబు అరెస్ట్ తప్పదా?

By:  Tupaki Desk   |   21 Oct 2019 4:11 PM GMT
అమిత్ షాతో జగన్ భేటీ..చంద్రబాబు అరెస్ట్ తప్పదా?
X
ఏపీ సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... సోమవారం ఢిల్లీ పర్యటన వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకే జగన్ ఈ పర్యటనకు వెళ్లారు. పలు కీలక అంశాలతో పాటుగా వాటి కంటే కూడా మరింత కీలకమైన విషయంపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నట్లుగా వెలువడుతున్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఈ అత్యంత కీలక అంశంపై చర్చించేందుకే జగన్... అమిత్ షా వద్దకు వెళ్లారన్న వార్తలు ఇప్పుడు తెలుగు నేలలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ కలకలం రేపుతున్నాయి. ఆ విషయం ఏమిటంటే... గత టీడీపీ హయాంలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ కు రంగం సిద్ధం చేసేందుకే జగన్... అమిత్ షా వద్దకు వెళ్లారన్న వార్తలు ఇప్పుడు నిజంగానే కలకలం రేపుతున్నాయి.

ఈ నెలలో వరుసగా రెండు సార్లు అమిత్ షా తో భేటీ కోసం జగన్ యత్నించగా... అపాయింట్ మెంట్ లభించలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందుననే జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో అమిత్ షా జాప్యం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా కూడా జగన్ పట్టు వదలని విక్రమార్కుడికి మల్లే అమిత్ షాతో భేటీ కోసం యత్నించారు. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీకి వెళ్లిన జగన్... అమిత్ షాతో భేటీ కోసం వేచి చూస్తున్నారు. అసలు జగన్ బయలుదేరే సమయానికి అమిత్ షా అపాయింట్ మెంట్ లభించకున్నా... షాతో భేటీ కోసం ఏకంగా ఇంకో రోజైనా ఢిల్లీలోనే ఉండేలా జగన్ తన షెడ్యూల్ ను సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమిత్ షా అపాయింట్ ఇవ్వకపోవడంతో జగన్ మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు.

అమిత్ షాతో భేటీలో చంద్రబాబును అరెస్ట్ చేసే విషయంపైనే ప్రధానంగా జగన్ చర్చలు జరపనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తన ప్రభుత్వం వచ్చాక... టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ సాగిస్తున్నానని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్న వైనం బయటపడిందని, ఈ అక్రమాలన్నింటికీ బాధ్యుడిగా నిలిచిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలని కూడా అమిత్ షాను జగన్ కోరనున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు ఆయన అనుచరులు ఎలా దోపిడీకి పాల్పడ్డారన్న విషయాన్ని కూడా జగన్ స్పష్టంగానే వివరించనున్నారట. రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపైనా జగన్ సమగ్ర నివేదికను అమిత్ షాకు అందజేయనున్ననట్టుగా కూడా తెలుస్తోంది. ఐదేళ్ల పాలనలో ఇన్నేసి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందేని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా జగన్ పట్టుబట్టనున్న నట్టుగా తెలుస్తోంది.

జగన్ వినిపించనున్న వాదనకు అమిత్ షా ఏమంటారో తెలియదు గానీ... చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే ఈ భేటీ కొనసాగనుందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇక ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్ పైనే కాకుండా తాము చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా సర్కారీ ఖజానాకు ఎంతమేర ప్రయోజనం లభించదన్న విషయాన్ని కూడా అమిత్ షాకు జగన్ వివరించనున్నట్గుగా తెలుస్తోంది. ఈ నెల ప్రథమార్ధంలో ప్రధాని నరేంద్ర మోదీతో తాను నిర్వహించిన భేటీ వివరాలను కూడా జగన్... అమిత్ షాకు వివరిస్తారట. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధుల విడుదలను కూడా జగన్ ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. అమిత్ షాతో భేటీలో జగన్ చాలా అంశాలనే ప్రస్తావించనున్నా.. చంద్రబాబు అరెస్ట్ కు సంబందించిన విషయమే ప్రధానాంశంగా ఉంటుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.