Begin typing your search above and press return to search.

టీడీపీ పై దాడులు.. తొలిసారి స్పందించిన జగన్.. హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   20 Oct 2021 8:45 AM GMT
టీడీపీ పై దాడులు.. తొలిసారి స్పందించిన జగన్.. హాట్ కామెంట్స్
X
రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జగనన్న తోడు పథకంలో భాగంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతీక్షణం ప్రయత్నిస్తున్నామని.. ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ అండగా నిలిచారని సీఎం చెప్పుకొచ్చారు.

ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక బూతులు తిడుతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ మాట్లాడని.. ఎప్పుడూ వినలేని దారుణమైన బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బూతులు వినలేక అభిమానులు ఆప్యాయత చూపించే వారి నుంచి వారు తట్టుకోలేక వారిలో రియాక్షన్ కనిపిస్తుందని చెప్పారు.

ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. మతాలు-కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పేదవాడికి మంచి జరగకూడదని.. మంచి జరిగితే జగన్ కు పేరు వస్తుందనే కారణంగా రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కోర్టుల్లో వారే కేసులు వేస్తారు.. పథకాలు అందకుండా వారే అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

ఎన్ని అడ్డంకులు వచ్చినా రెండున్నరేళ్ల కాలంలో ప్రజలు మెచ్చుకునేలా వారికి మేలు జరిగేలా పాలన సాగుతోందని జగన్ చెప్పారు. అసత్యాలు ప్రచారం చేయటం.. వారికి ఒక సెక్షన్ మీడియా మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా ఏరోజు ఈ రకంగా వ్యవహరించలేదని.. ఇటువంటి భాష ఉపయోగించలేదని చెప్పారు. కావాలని తిట్టించి కావాలని వైషమ్యాలు తీసుకురావాలనేది వారి లక్ష్యమని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ రకరకాలుగా అడ్డంకులు తీసుకురావడటానికి ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి కుల, మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. సంక్షేమ పాలన చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని వ్యాఖ్యానించారు.

-టీడీపీ రెచ్చగొట్టడంపై జగన్ ఆదేశాలివే: శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రంలో టీడీపీ దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం జగన్ ఆదేశాలేంటో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని జగన్ ఆదేశించారని తెలిపారు. ఏపీలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిపై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారన్నారు. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని విమర్శించారు.