Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌ళ్లీ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   3 Nov 2018 5:27 AM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర మ‌ళ్లీ ఎప్పుడంటే..?
X
కుట్ర‌పూరిత దాడితో గాయ‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర మ‌ళ్లీ ఎప్పుడు ప్రారంభం కానుంది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడితో జ‌గ‌న్ భుజానికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. దీనికి స‌ర్జ‌రీ చేసిన వైద్యులు.. జ‌గ‌న్ ను విశ్రాంతి తీసుకోవాల‌ని కోరారు.

హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. ఆయ‌న భుజానికి అయిన గాయం త‌గ్గ‌క‌పోవ‌టం.. నొప్పి ఉండిపోవ‌టంతో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

తాజాగా ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యుల బృందం.. భుజం గాయం ఇంకా మాన‌లేద‌ని.. క‌నీసం మ‌రో మూడు వారాలు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ భుజానికి అయిన గాయాన్ని తాజాగా ప‌రీక్షించిన వైద్యులు..జ‌గ‌న్ భుజానికి అయిన గాయం 3.5 సెంటీమీట‌ర్లు లోతుగా ఉండ‌టంతో జ‌గ‌న్ భుజానికి శ‌స్త్ర‌చికిత్స చేసిన‌ప్పుడు కండ‌రంలోని కొంత భాగాన్ని తొల‌గించిన‌ట్లుగా చెప్పారు.

ఈ కార‌ణంగా గాయం మాన‌టానికి మ‌రికొంత స‌మ‌యం పడుతుంద‌ని వెల్ల‌డించారు. చేయి క‌దిల్చిన‌ప్పుడు నొప్పిగా ఉన్న విష‌యాన్ని చెప్పారు. అందుకే మ‌రో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించిన‌ట్లుగా సిటీ న్యూరో సెంట‌ర్ వైద్యులు ప్ర‌క‌టించారు. క‌నీసం ఏడు నుంచి ప‌ది రోజులు భుజం క‌ద‌ప‌కుండా ఉండ‌టం మంచిద‌ని వైద్యులు చెప్ప‌టంతో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

గాయాన్ని ప‌ట్టించుకోకుండా పాద‌యాత్ర‌ను తిరిగి స్టార్ట్ చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నా.. వైద్యులు మాత్రం వారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. తొంద‌ర‌ప‌డి పాద‌యాత్ర‌ను స్టార్ట్ చేస్తే.. భుజం మీద మ‌రింత ఒత్తిడి ప‌డుతుంద‌ని.. వ‌ద్ద‌ని చెప్ప‌టంతో అయిష్టంగానే విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీ వ‌ర్గాల ప్ర‌క‌ట‌న ప్ర‌కారం చూస్తే.. మ‌రో వారం నుంచి ప‌ది రోజుల వ‌ర‌కూ పాద‌యాత్ర‌కు బ్రేక్ సాగుతుంద‌ని.. ఆ త‌ర్వాత ఆయ‌న పాద‌యాత్ర పునః ప్రారంభం అవుతుంద‌ని చెబుతున్నారు. సో.. మ‌రో వారం లేదంటే ప‌ది రోజుల వ‌ర‌కూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.