Begin typing your search above and press return to search.

ఏపీలో 'ఢిల్లీ' ఫివర్...సీఎం జగన్ అలర్ట్

By:  Tupaki Desk   |   31 March 2020 2:30 PM GMT
ఏపీలో  ఢిల్లీ ఫివర్...సీఎం జగన్ అలర్ట్
X
కరోనాను కట్టడి చేయడంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఒకడుగు ముందే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ భారత్ లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించే నాటికే ఏపీ - తెలంగాణల్లో మార్చి 31 వరకు షట్ డౌన్ కొనసాగుతోంది. ఇక, ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో ఏపీలో గ్రామ వలంటీర్ల వ్యవస్థ సీఎం జగన్ కు ఎంతగానో ఉపయోగపడింది. నిరంతర పర్యవేక్షణ - ప్రజా ప్రతినిధులు - అధికారుల సమన్వయంతో ఏపీలో కరోనా తీవ్రత పెరగకుండా సీఎం జగన్....ఏపీ ప్రజలను పొందుగుల సరిహద్దు వద్ద నిలిపివేయడం వంటి పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వీటి ఫలితంగానే ఏపీలో నిన్నటివరకూ కరోనా కేసులు కేవలం 23 మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కస్ మసీదులో జరిగిన ప్రత్యేక సమావేశాల(మషూర)కోసం వెళ్లిన కొందరు తెలుగురాష్ట్రాల ప్రజలు కరోనా బారిన పడడంతో సీఎం జగన్ కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదై...మొత్తం కేసుల సంఖ్య 40కి చేరడంతో జగన్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 40కి చేరడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసులు - వాటిపై తీసుకుంటోన్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారంనాడు కొత్తగా నమోదైన 17 కేసుల్లో 14 కేసులు ఢిల్లీలోని మర్కస్ మసీదులో జరిగిన సమావేశాలతో కనెక్షన్ ఉన్నవేనని అధికారులు వెల్లడించారు. వారితోపాటు రైల్లో ప్రయాణం చేసినవారి వివరాలను సేకరించామని - ఇప్పటికే గుర్తించిన వారిని క్వారంటైన్‌ కు - ఐసోలేషన్‌ కు తరలిస్తున్నామని చెప్పారు. ఆయా వ్యక్తుల నివాస ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి పరిశీలిస్తున్నామని అన్నారు. ఢిల్లీ వెళ్లినవారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని - వారందరికీ ప్రభుత్వమే వైద్యం అందిస్తుందని జగన్ చెప్పారు. పోలీసులు - వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో.. ఢిల్లీ వెళ్లి వచ్చినవారి వివరాలను గుర్తించాలని - అర్బన్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే కొనసాగించాలని అన్నారు. చదువుకున్నవారు - కరోనాపై అవగాహన ఉన్నవారు వెబ్‌ సైట్ - కాల్ సెంటర్ ద్వారా స్వయంగా వివరాలు వెల్లడించవచ్చని అన్నారు. సూపర్‌ మార్కెట్లు - రైతు బజార్ల ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని - ఏప్రిల్‌ 1 నుంచి అన్ని షాపుల ముందు ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు.