Begin typing your search above and press return to search.

ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా జగన్ పాలన .. సీఎంకి లేఖ రాసిన సోము వీర్రాజు , ఏ విషయంలో అంటే !

By:  Tupaki Desk   |   8 Jan 2021 9:32 AM GMT
ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా జగన్ పాలన .. సీఎంకి లేఖ రాసిన సోము వీర్రాజు , ఏ విషయంలో అంటే !
X
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్ కి లేఖ రాశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. దేశంలోని అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలనే మోడీ సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించారని, దానికి అనుగుణంగా జగన్ వాటిని నిర్మిస్తున్నారని అన్నారు. ఒక్కో వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం 50 కోట్ల రూపాయలను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. జగన్ గొప్ప అభిలాషకు మోడీ ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తోందని అన్నారు. నంద్యాలలో బోధనాసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని సోము వీర్రాజు అన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని చెప్పారు.

ఇప్పుడు కేటాయించిన స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము రైతాంగం పక్షాన నిలుస్తున్నామని, వారి డిమాండ్‌ ను బలపరుస్తున్నామని అన్నారు. వైద్య కళాశాలను నిర్మించడానికి నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. దీనిపై కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. దీని పట్ల రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోందని సోము వీర్రాజుు పేర్కొన్నారు. ఈ ప్రదేశంలో బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు కష్టతరమౌతుందని చెప్పారు.

నంద్యాల, పట్టణ పరిసరాల్లోనే పలు ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, ఆ భూములను బోధనాసుపత్రి నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కావాల్సినంత ఖాళీ స్థలం ఉండటం వల్ల భవిష్యత్తులో ఆ బోధనాసుపత్రి విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని సూచించారు. అంతేకానీ ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవసాయ కేంద్రానికి చెందిన స్థలంలో.. బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల పరిశోధనలు కుంటు పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని అన్నారు. మరో ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు