Begin typing your search above and press return to search.

ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చిన జగన్ సర్కార్ .. విచారణకు ఆదేశాలు !

By:  Tupaki Desk   |   9 March 2021 12:30 PM GMT
ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చిన జగన్ సర్కార్ .. విచారణకు ఆదేశాలు !
X
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో డిపార్ట్ మెంట్ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డాడని ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో అంశంలోనూ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణ జరపాలని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో ఏపీ ‌లో అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారని, అప్పటి ప్రతిపక్షాన్ని వేధించేందుకు ప్రయత్నించారనే అంశంపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి విచారణాధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను నిమిస్తూ కీలక నిర్ణయం.

ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ 1969 ప్రకారం నిబంధనలకు లోబడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. నిష్పాక్షికంగా విచారణ కోసం నియమించిన విచాణాధికారి ఎదుట ప్రభుత్వం తరపున తన వాదనలను వినిపించేందుకు న్యాయవాది సర్వ శ్రీనివాసరావు ప్రజెంటింగ్ ఆఫీసర్‌ గా నియమించారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే .. ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్ ‌గా ఉన్న సమయంలో నిబంధనలకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై గతంలోనే ఏపీ సర్కార్ సస్పెన్షన్ విధిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించింది. దీనిపై అయన న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే .. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పై నేడు సుప్రీంలో విచారణ జరిగింది. ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శాఖాపరమైన దర్యాప్తును ఏప్రిల్‌ 8లోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. రోజువారీగా దర్యాప్తు చేపట్టాలని దర్యాప్తు అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారి ఏప్రిల్‌ 30లోగా పూర్తి దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు సమగ్ర నివేదికను కోర్టుకు తదుపరి విచారణ తేదీలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.