Begin typing your search above and press return to search.

జగన్ సంచలనం - ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ!

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 PM GMT
జగన్ సంచలనం - ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ!
X
తమ బిడ్డలకు ఆస్తులు, అంతస్థులు ఇవ్వకున్నా పర్లేదు కానీ.. వాటిని మించిన విద్యను అందిస్తే చాలు వారు బాగుపడుతారు. ఆస్తులు, అంతస్థులను వారే సంపాదించుకుంటారు. విద్యను మించిన ధనం మన సమాజంలో లేదు. విద్యతోపాటు డబ్బు, ఆస్తులు, అంతస్తులు వాటంతట అవే వస్తాయి.

అందుకే ఇప్పుడు ఎవ్వరైనా తమ సంపాదనతో తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని.. కార్పొరేట్ కాలేజీల్లో లక్షలు పోసి చదివిస్తున్నారు. విద్యపై పెట్టే ఖర్చే జీతంలో సగానికి పైగా ఉంటుంది.అంతటి కీలకమైన విద్యావ్యవస్థలో ప్రైమేటు దోపిడీని అరికడుతూ ఇప్పటికే సీఎం జగన్ 'నాడు-నేడు', అమ్మఒడి , విద్యాకానుక అంటూ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పంచుతూ ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు.

తాజాగా సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులు, విద్యాకానుకపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వ 'సీబీఎస్ఈ' సిలబస్ ను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024నాటికి పదోతరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమల్లోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. అమ్మఒడిలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల నాణ్యత, సర్వీసు బాగుండలన్నారు. నాడు-నేను పనులను కూడా మార్చికల్లా పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లను రెడీ చేయాలని ఆదేశించారు.

మొత్తంగా ఏపీలో చదువులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఓటు హక్కు లేకున్నా భావి భారతానికి విద్యార్థులే ఆయువు పట్టు కావడంతో వారి సంక్షేమానికి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. ఏపీలో సీబీఎస్ఈ అమలు నిర్ణయం తీసుకున్న జగన్ పై మేధావులు, విద్యావేత్తల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.