Begin typing your search above and press return to search.

బాబుపై జ‌గ‌న్ పిట్ట‌క‌థ అదిరిందిగా

By:  Tupaki Desk   |   6 Feb 2018 4:10 AM GMT
బాబుపై జ‌గ‌న్ పిట్ట‌క‌థ అదిరిందిగా
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై ఆంధ్రోళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాబు కానీ ముఖ్య‌మంత్రి అయితే ఆయ‌న అనుభ‌వం రాష్ట్రానికి ప‌నికి వ‌స్తుంద‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌లు.. వారి మాట‌ల్ని న‌మ్మి ఓటేసిన ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో ఏపీలో జ‌రిగిన అభివృద్ధి కంటే ఆ పేరుతో తీసుకొచ్చిన అప్పు కొండ‌లా మారింద‌న్న విమ‌ర్శ ఉంది.

తానంత మొన‌గాడు ఎవ‌రూ ఉండ‌ర‌ని అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం తాజాగా కేంద్ర ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి చూపించిన మొండి చెయ్యి చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టి.. దానిపై చ‌ర్చ జ‌రిగిన రోజుల్లో ఏపీకి ఎంతో అన్యాయం జ‌రిగింద‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం.. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్ని వ‌దిలేయ‌టం గ‌డిచిన కొన్నేళ్లుగా ఏపీ ప్ర‌జ‌లు చూస్తున్న‌దే.

తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లోనూ ఏపీకి మోడీ హ్యాండివ్వ‌టం.. ఆ వెంట‌నే బాబు ఆగ్ర‌హం.. దండం పెట్టి మ‌రీ కూట‌మి నుంచి వ‌చ్చేస్తామ‌న్న మాట చెప్ప‌టం.. ఆ వెంట‌నే త‌మ్ముళ్లు చెల‌రేగిపోవ‌టం.. వారిని క‌ట్ట‌డి చేయ‌టం కోసం రివ్యూ పెట్టి.. న‌ర్మ‌గ‌ర్భంగా విష‌యాన్ని చెప్పి కేంద్రంపై క‌స్సుమంటున్నోళ్ల‌ను కంట్రోల్ చేయ‌టం లాంటివి ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా జ‌రిగిపోతున్నాయి.

ఇదిలా ఉంటే.. బాబు తీరుపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న విమ‌ర్శ‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అన్నింటికి మించి పాద‌యాత్ర సంద‌ర్భంగా బాబు తీరును ఒక పిట్ట‌క‌థ‌తో పోల్చి చెబుతున్న వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 2014 నుంచి ఎన్డీయే ప్ర‌భుత్వ భాగ‌స్వామిగా ఉంటూ.. త‌న ఎంపీల్ని మోడీ క్యాబినెట్ లో కొన‌సాగిస్తున్న బాబుకు.. మోడీ బ‌డ్జెట్ కేటాయింపులు ఎలా ఉండ‌నున్నాయ‌న్న విష‌యం మీద అవ‌గాహ‌న ఉండ‌కుండా ఉంటుందా? అంటూ జ‌గ‌న్ వేస్తున్న సూటిప్ర‌శ్న‌కు తెలుగు త‌మ్ముళ్ల నోటి నుంచి స‌మాధానం రాలేదు. జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కు స‌మాధానం చెప్ప‌ని బాబు.. ఏపీకి మోడీ స‌ర్కారు చేస్తున్న అన్యాయంపై మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని చెప్పాల్సింది.

ఇలాంటి వేళ‌.. బాబు తీరును చూస్తే త‌న‌కో క‌థ గుర్తుకు వ‌స్తోందంటూ జ‌గ‌న్ చెబుతున్న వైనం ఇప్పుడు అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ జ‌గ‌న్ చెబుతున్న పిట్ట‌క‌థ ఏమిటంటే.. అన‌గ‌న‌గా ఓ ముద్దాయి. అత‌న్ని కోర్టుకు తీసుకొచ్చారు. బోనులో నిల‌బెట్టారు. జ‌డ్జి వ‌చ్చాక ఆ ముద్దాయి.. అయ్యా.. త‌ల్లీదండ్రీ లేనోడ్ని. నాకెవ‌రు దిక్కు లేరు సార్. న‌న్ను విడిచిపెట్టండి సార్ అంటూ బిగ్గ‌ర‌గా ఏడ్వ‌టం మొద‌లెట్టాడు. అత‌ని మాట‌ల్ని విన్న జడ్జి.. అత‌న్ని ఎందుకు తెచ్చారు? ఏం త‌ప్పు చేశాడంటూ పీపీ (ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌)ని అడిగార‌ట‌. అప్పుడాయ‌న సార్.. ఇత‌ను చెప్పేవ‌న్నీ దొంగ మాట‌లు. త‌ల్లిదండ్రుల్ని ఇత‌డే చంపాడు. అందుకే అత‌న్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చార‌ని చెప్పారంటూ.. స‌రిగ్గా చంద్రబాబు కూడా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

రాష్ట్రం విడిపోవ‌టానికి కార‌ణం చంద్ర‌బాబే. ఆయ‌నే లేకుంటే రాష్ట్రం క‌లిసిక‌ట్టుగా ఉండేది. ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌టానికి ఆయ‌నే కార‌ణం. ఆ రోజేమో ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అని చెప్పి.. ఈ రోజేమో అదేమైనా సంజీవినా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దుగరాజ‌ప‌ట్నం పోర్టు క‌ట్టాల‌ని చ‌ట్టంలో ఉంటే.. ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్లేద‌న్నాడు. ఆంధ్రుల క‌ల‌ల పంట పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం చంద్ర‌బాబు తీసుకుంటున్న లంచాల మ‌ధ్య అధ్వానంగా మారింద‌ని.. ఇన్ని పాపాలు.. నేరాలు చేసిన చంద్ర‌బాబుకు.. త‌ల్లిదండ్రుల్ని చంపి కోర్టులో నిల‌బ‌డి దొంగ ఏడుపులు ఏడుస్తున్న ముద్దాయికీ ఏదైనా తేడా ఉందా? అంటూ ప్ర‌శ్నిస్తున్న వైనం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.