Begin typing your search above and press return to search.

మూడు రాజధానులపై మరోసారి జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   31 Oct 2022 8:30 AM GMT
మూడు రాజధానులపై మరోసారి జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
X
తన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పరిపాలన సాగుతుందని తేల్చిచెప్పారు. సీఎం, మంత్రులు ఎక్కడ ఉంటే సచివాలయం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు.

విశాఖలో రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు పెడితే మంచి రాజధాని నగరాన్ని తీర్చిదిద్దవచ్చని స్పష్టం చేశారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు అక్కడ ఉన్నాయన్నారు. పరిపాలన సౌలభ్యం, ఆర్థికంగా అనుకూలతలు ఉండటం వల్లే విశాఖను రాజధాని నగరంగా ఎంపిక చేశామని జగన్‌ వెల్లడించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను కార్యనిర్వాహక రాజధాని ఎంపిక చేశామని తెలిపారు.

అయినా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కడ నుంచే పరిపాలిస్తే అభ్యంతరం ఏంటని జగన్‌ నిలదీశారు. ముఖ్యమంత్రికి ఎక్కడ నుంచి పాలించాలనే స్వేచ్ఛ ఉండదా అని ప్రశ్నించారు. ఎవరెవరో సీఎం ఎక్కడ నుంచి పాలించాలో ఎలా నిర్ణయిస్తారని ఆయన హాట్‌ కామెంట్స్‌ చేయడం గమనార్హం.

మరోవైపు తనకు అమరావతిపై ఎలాంటి కోపం లేదని జగన్‌ తేల్చిచెప్పారు. ఈ మేరకు తాజాగా ఆయన ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు కోపం ఉంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు పెడతామని ప్రశ్నించారు. అమరావతి అటు విజయవాడ నగరానికి, ఇటు గుంటూరు నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అమరావతిలో ఎలాంటి వసతులు సమకూరలేదని చెప్పారు.

గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిందని తెలిపారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని, శాసన వ్యవస్థలన్నీ ఇక్కడే ఉంటాయన్నారు. అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా దాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడం కష్టమని జగన్‌ తేల్చేయడం గమనార్హం.

అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే చంద్రబాబు సన్నిహితులు అక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. తద్వారా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని జగన్‌ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల ఆందోళన రాజధాని కోసం కాదని రియల్‌ ఎస్టేట్‌ భూముల కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో జగన్‌ జాతీయ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు నవంబర్‌ 1 నుంచి సుప్రీంకోర్టు రాజధాని వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్పీఎల్‌)ను విచారించనుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ విచారణ జరుగుతుంది.

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం నుంచి పరిపాలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి కల్లా విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని వైసీపీ నేతలు కూడా అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.