Begin typing your search above and press return to search.

కొత్త మరక: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం

By:  Tupaki Desk   |   23 Sep 2021 3:31 AM GMT
కొత్త మరక: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం
X
మరో తలనొప్పి ఏపీ అధికారపక్షానికి ఎదురైంది. అత్యాచారాలపై తమ పార్టీ స్టాండ్ ను క్లియర్ గా చెబుతూ.. అలాంటి పాడు పనులు చేసినోళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న వేళ.. పార్టీకి చెందిన నేత ఒకరు దివ్యాంగురాలిని అత్యాచారానికి గురి చేయటం షాకింగ్ గా మారింది. ఈ దారుణం విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం సిలేరులో చోటు చేసుకుంది. స్థానిక సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం.. పెళ్లైన కొన్నాళ్లకే బాధితురాలిని భర్త వదిలేశాడు. దీంతో.. ఆమె తల్లి దగ్గరే ఉంటూ వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం బాధితురాలి తమ్ముడు జబ్బున పడగా.. తల్లి విజయనగరానికి వెళ్లింది.

ఇంతో దివ్యాంగురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. సోమవారం అర్థరాత్రి ఆరుబయట మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడే కాపు కాసిన వైసీపీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకటరావు ఆమెపై దాడికి పాల్పడ్డారు. చున్నీతో నోరు మూసేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే బాగోదని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఊరి నుంచి ఇంటికి వచ్చిన తల్లితో తనపై జరిగిన లైంగిక దాడి గురించి దివ్యాంగురాలు చెప్పటంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు.

దీంతో స్పందించిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వైసీపీ నేత వెంకటరావును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతం స్థానిక వైసీపీ నాయకత్వానికి సమస్యగా మారింది. దీన్నో రాజకీయ అంశంగా మార్చి.. అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు.

అత్యాచార కేసుల్లో ఉన్న మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకొని కింది స్థాయికి చెందిన కొందరు వైసీపీ నేతలు మహిళల జీవితాలతో ఆటలాడుతున్నట్లుగా విమర్శలు చేశారు. దివ్యాంగురాలిపై వైసీపీ నేత వెంకట్రావు అత్యాచారానికి పాల్పడితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ వ్యవహారం రాజకీయ రగడ గా మార్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విపక్షం ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి చెత్త పనులు చేసే నేతల తాట తీయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదినేత వెంటనే కల్పించుకోవాలని కోరుతున్నారు.