Begin typing your search above and press return to search.

క్రమం తప్పకుండా అక్కడికి జగన్... ?

By:  Tupaki Desk   |   4 Feb 2022 5:30 PM GMT
క్రమం తప్పకుండా అక్కడికి  జగన్... ?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రానున్నారు. ఆయన ఇపుడున్న పరిస్థితుల్లో ఆయన విశాఖ రావడం అంటే నిజంగా గ్రేట్ అనాలి. ఒక వైపు ఉద్యోగుల సమ్మె ఉంది. మరో వైపు అనేక ఇతర రాజకీయ పరిణామాలు కూడా జోరుగా మారుతున్నాయి. కేంద్ర బడ్జెట్ మీద కూడా ఏపీకి ఏమీ రాని పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే అన్ని విధంగా చూసినా ఏ విషయాన అయినా ప్రభుత్వమే కార్నర్ అవుతున్న నేపధ్యం. అనేక రకాలైన తలనొప్పులు వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఉన్నాయి.

అయినా కూడా ఈ బిజీ షెడ్యూల్ లో కూడా ఈ కీలకమైన సమయంలో ముఖ్యమంత్రి విశాఖ టూర్ పెట్టుకున్నారు. అది కూడా విశాఖ శారదాపీఠంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఆయన వస్తున్నారు. ఈ నెల 9న జగన్ విశాఖ రావడం దాదాపుగా ఖరారు అయిందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఆ రోజు ఉద‌యం బయలుదేరి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

అక్కడ నుంచి నేరుగా జగన్ శారదాపీఠానికి వెళ్తారు. శారదాపీఠం వార్షికోత్సవాలలో ఆయన పాలుపంచుకుంటారు. అక్కడ జరిగే రాజ్యశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో ముఖ్యమంత్రి హాజరవుతారు. స్వామెజీ ఆశీస్సులు అందుకున్న మీదట ఆయన తిరిగి విజయవాడకు ప్రయాణం అవుతారు.

ఇదిలా ఉండగా గత ఏడాది కూడా ముఖ్యమంత్రి పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఏటా క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి ఇక్కడకి రావడం విశేషం. అదే టైమ్ లో రాజశ్యామల హోమంలో పాలుపంచుకోవడానికి ఆయన ఎపుడూ ఆసక్తి చూపిస్తారు. అధికార ప్రాప్తికి రాజశ్యామల మాత అనుగ్రహం అవసరమని అధ్యాత్మిక పరులు భావిస్తారు. ఆ విధంగా హోమ ఫలాలు కేసీయార్ తో పాటు జగన్ కూడా ఇప్పటికే అందుకున్నారని కూడా అంటారు.

మొత్తానికి జగన్ గత కొన్నేళ్ళుగా పీఠానికి వస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రావడం ఇది మూడవ సారి. మొత్తానికి జగన్ వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోకుండానే పీఠానికి వచ్చి వెళ్తూండడం ఎప్పటిమాదిరిగానే జరుగుతోంది. దీంతో సీఎం రాక కోసం వైసీపీ వర్గాలు ఎదురుచూస్తూంటే ఆయన ఇతరత్రా ఏమైనా సమావేశాలలో పాలుపంచుకుంటారా అన్నది కూడా చూడాలని అధికార వర్గాలు అంటున్నారు.