Begin typing your search above and press return to search.

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్!

By:  Tupaki Desk   |   22 Jun 2022 6:37 AM GMT
గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ షాకిచ్చింది. త్వ‌ర‌లో త‌మ ప్రొబేష‌న్ ఖ‌రారై.. జీతాలు పెరుగుతాయ‌ని ఉద్యోగులు ఆనంద‌ప‌డుతుండ‌గా వారి ఆశ‌ల‌పై నీళ్లు చిమ్మింది. ఇళ్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు సంబంధించిన ఓటీఎస్ లెక్క‌లు తేల్చితేనే వారి ప్రొబేష‌న్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) స‌మీర్ శ‌ర్మ అధికారుల‌కు సూచించారు.

దీంతో గ్రామ‌, వార్డు సచివాల‌యాల ఉద్యోగులు ల‌బోదిబోమంటున్నారు. ప్రొబేష‌న్ ఖ‌రార‌యితే త‌మ ఉద్యోగాలు ప‌ర్మినెంట్ అవుతాయ‌ని ఉద్యోగులు ఆనంద‌ప‌డుతుండ‌గా.. ఇళ్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు సంబంధించి వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) ను వారి ప్రొబేష‌న్ కు లింకుగా పెట్ట‌డంపై విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా ఓటీఎస్ కు సంబంధించి ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన రూ.82.46 కోట్ల‌కు వెంట‌నే లెక్క‌లు తేల్చాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఆదేశించారు.

కాగా గ‌త ప్ర‌భుత్వాలు పేద‌ల కోసం నిర్మించిన ఇళ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఓటీఎస్ ను తెచ్చి ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్ర‌జ‌లెవ‌రూ వీటిని క‌ట్టొద్ద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చి ఓటీఎస్ ను ర‌ద్దు చేస్తామ‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేద‌ల నుంచి నిర్దేశిత రుసుములు వ‌సూలు చేసి వారి పేర్ల‌తో ఇంటికి రిజిస్ట్రేష‌న్ చేయించే బాధ్య‌త‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు అప్ప‌గించింది. ఇందులో భాగంగా వారికి వ‌సూళ్ల ల‌క్ష్యాల‌ను కూడా నిర్దేశించింది. ల‌క్ష్యాల‌ను అందుకోలేనివారిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.

ఈ నేప‌థ్యంలో జూలై నుంచి స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప్రొబేష‌న్ ఖ‌రారు చేయ‌నున్న ద‌శ‌లో జూన్ 16న ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ స‌మావేశం నిర్వ‌హించారు. ఓటీఎస్ గురించి వారిని ఆరా తీశారు. ఇంకా డిపార్టుమెంట్ కు 82.46 కోట్లు రూపాయ‌ల రావాల్సి ఉంద‌ని అధికారులు సీఎస్ కు వివ‌రించారు. దీంతో జిల్లాల‌వారీగా లెక్కలు పంపుతున్నామ‌ని.. ఏ జిల్లాలో వ‌సూలు కావాల్సి ఉందో వేగంగా తేల్చాల‌ని సీఎస్ ఆదేశించారు. లెక్క‌లు చెప్ప‌ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల ప్రొబేష‌న్ ను నిలిపివేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఆదేశాల‌తో ఉద్యోగుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేరవేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.37 లక్షల ఉద్యోగుల్ని నియమించారు. అయితే రెండేళ్ల పాటు ప్రొబేషన్ కింద పనిచేయాలని, ఆ తర్వాత శాఖాపరమైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయితే ప్రొబేషన్ ఖరారు చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో నిబంధ‌న విధించింది. ప్రొబేషన్ కాలంలో నెలకు 15 వేల చొప్పున ఇస్తామని, ఉద్యోగం ఖరారైన తర్వాత రెగ్యులర్ వేతనాలు ఉంటాయని హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు గతేడాది అక్టోబర్ 2కి వారి ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన శాఖాపరీక్షల్లోనూ దాదాపు 80 వేల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ ఇంకా ప్రొబేషన్ ఇవ్వలేదు. మ‌రికొన్ని వేల మందికి అస్స‌లు డిపార్టుమెంట్ ప‌రీక్షలే నిర్వ‌హించ‌లేదు.

గతేడాది నుంచి పెండింగ్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను ఈ ఏడాది జూన్ లో ఖరారు చేస్తామని సీఎం వైఎస్ జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ కూడా ఇంకా నెరవేరలేదు. తాజాగా ఈ డెడ్ లైన్ ను జూలైకి మార్చారు. జూలైలో ప్రొబేషన్ ఇస్తామని, ఈ లెక్కన ఆగస్టు నెలలో కొత్త వేతనాలు తీసుకోవచ్చని తెలిపారు. దీంతో వచ్చే నెలలో ఎలాగైనా తమకు ప్రొబేషన్ ఖరారవుతుందని క్వాలిఫైడ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారికి ఓటీఎస్ రూపంలో జ‌గ‌న్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.