Begin typing your search above and press return to search.

జగన్ ను సైలెంట్ చేసిన అనంతపురం స్కాం

By:  Tupaki Desk   |   27 March 2016 4:34 AM GMT
జగన్ ను సైలెంట్ చేసిన అనంతపురం స్కాం
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు కొన్ని మాటలంటే అస్సలు ఇష్టం ఉండదు. తనకు నచ్చని మాట వింటే చాలు ఆయన అగ్గి మీద గుగ్గిలంలా చెలరేగిపోతారు. తిట్ల పురాణం అందుకుంటారు. పైన దేవుడున్నాడు.. మొట్టికాయలు వేస్తారని శపించటమే కాదు.. మా మీద అంతేసి బండలు ఎలా వేస్తారంటూ విరుచుకుపడతారు. నచ్చని మాట వింటే అంతలా చెలరేగిపోయే జగన్ లో మరో కోణం ఉంది. అనంతపురం పట్టణ నడిబొడ్డున ఉండే ‘‘మిస్సమ్మ ఆస్తుల’’ గురించి మాట వస్తే చాలు.. కామ్ అయిపోతారు. నోట మాట రానట్లుగా ఉంటారు. నచ్చని చంద్రబాబు విషయంలో అంతలా చెలరేగిపోయే జగన్.. తనకేమాత్రం నచ్చని మిస్సమ్మ ఆస్తుల గురించి ప్రస్తావన వస్తే చాలు.. కామ్ అయిపోవటం కనిపిస్తుంది.

ఇంతకీ ఈ మిస్సమ్మ ఆస్తుల కథను.. ముచ్చటగా మూడు ముక్కల్లో తేల్చేస్తే.. అనంతపురం బస్లాండ్ వద్దనున్న ఈ భూముల్ని వైఎస్ హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితులైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి బ్రదర్స్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ల్యాండ్స్ విలువ ఎంతో తెలుసా? సింఫుల్ గా రూ.200 కోట్లు మాత్రమే. అంత విలువన్న ల్యాండ్ తన తండ్రికి.. తనకు సన్నిహితులైన వారికి చెంది ఉండటం.. దీనిపై ఏపీ అధికారపక్షం అసెంబ్లీలో మూకుమ్మడిగా దాడి చేస్తే ఆయన మాత్రం ఏం చేయగలరు.

నచ్చని అన్ని విషయాల మీద రియాక్ట్ అయినట్లుగా కావటానికి జగన్ సుద్దపూస కాదుగా. అందుకే.. ఆయన అంటీ అంటనట్లు.. ముట్టిముట్టనట్లుగా మాట్లాడేసి.. ఈ విషయాన్ని మమ అని పూర్తి చేశారు. అనంతపురంలోని చిన్న పిల్లాడికి మిస్సమ్మ భూముల ఇష్యూ తెలుసంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించి.. అదంతా వైఎస్ పుణ్యమేనని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పందిస్తూ.. జగన్ కు క్రైస్తవుల మీద నిజంగా ప్రేమ ఉంటే.. మిస్సమ్మ భూముల మీద సీరియస్ గా రియాక్ట్ కావాలని డిమాండ్ చేశారు.

ఇలా.. ఏపీ అధికారపక్ష సభ్యులు విరుచుకుపడటంతో డిఫెన్స్ లో పడ్డ జగన్ అతి కష్టమ్మీదా నోరు విప్పుతూ.. ఈ ఇష్యూ మీద సీఐడీ దర్యాఫ్తు నెలాఖరు లోపు విచారణ ముగుస్తుందని ప్రభుత్వమే చెబుతున్న నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కామ్ అయ్యారు. ఏపీ అధికారపక్షం వ్యూహాత్మకంగా బుక్ చేశాక.. జగన్ నోటి నుంచి అంతకు మించి ఇంకేం మాట రాగలదు?