Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇంట గెల‌వ‌డం కాదు..ర‌చ్చ గెల‌వాలి..!

By:  Tupaki Desk   |   1 Dec 2019 9:50 AM GMT
జ‌గ‌న్ ఇంట గెల‌వ‌డం కాదు..ర‌చ్చ గెల‌వాలి..!
X
ఏపీలో ప్ర‌భుత్వం మారింది. ఈ ఏడాది మే 30న వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వ సార‌థిగా ప్ర‌మాణం చేశారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరు మాసాలు పూర్తి చేసుకుంది. ఈ ఆరు మాసాల స‌మ‌యం నిజానికి ఏ ప్ర‌భుత్వాని కైనా చాలా చిన్న స‌మ‌య‌మే. అయితే, జ‌గ‌నే చెప్పిన‌ట్టు ఆరు మాసాల్లో రాష్ట్రంలో మార్పులు చేసిన చూపి స్తాను అన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్న మాట‌.. గ‌త చంద్ర‌బాబు పాల‌న క‌న్నా.. జ‌గ‌న్ పాల‌న బాగానే ఉంది.. అని..! అయితే, ఆ వెంట‌నే కానీ... అంటూ ఒకింత పెద‌వి విరుస్తున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. ఇది జ‌గ‌న్‌ పై కోపం తోనో.. ఆయ‌న పాల‌న‌పై బెడ్డ‌లు వేయాల‌నో కాదు.

కేవ‌లం.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వెళ్తున్నా.. ఒక‌వైపే ఆయ‌న చేస్తున్నార‌నేది సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల అభిప్రాయంగా ఉంది. అంటే.. పాల‌న రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి ప్ర‌జ‌ల సంక్షేమం. రెండు రాష్ట్ర అభివృద్ధి. సంక్షేమం విష‌యంలో బ‌హుశా జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన‌న్ని ప‌థ‌కాలు కానీ - ఇంత భారీ స్థాయిలో ఆర్థిక లబ్ధిని కానీ - ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ అమ‌లు చేయ‌లేదు. సో.. సంక్షేమం విష‌యంలో జ‌గ‌న్‌కు నూటికి రెండు వంద‌ల మార్కులు ప‌డుతున్నాయి.

అయితే, అదే స‌మ‌యంలో రాష్ట్ర అభివృద్ది విష‌యంపైనే జ‌గ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌నేది సోష‌ల్ మీడియాలో ఎక్కువుగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌. దీనిలో ప్ర‌ధాన‌మైన కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు - నీళ్లు.. స‌హా ప‌థ‌కాల విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ఈ ఆరు మాసాల్లో వ్య‌వ‌హ‌రించింది లేద‌నేది వీరి భావ‌న‌గా ఉంది. అంటే.. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం .. రాష్ట్రానికి రాజ‌ధాని నిర్మాణానికి - క‌డప ఉక్కు ఫ్యాక్ట‌రీకి - పోల‌వ‌రం ప్రాజెక్టుకు, వెనుక‌బ‌డిన మండ‌లాల‌కు - అనేక విశ్వ‌విద్యాల‌యాల‌కు కేంద్రం నుంచి నిదులు రావాల్సి ఉంది. ఇక‌ - ప్ర‌త్యేక హోదా అనేది మ‌రో అమ‌లుకు నోచుకోని డిమాండ్ అలా జీవ‌చ్ఛ‌వంగా కొట్టుకుంటూనే ఉంది.

వీటి విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి వ్యూహం అమ‌లు చేస్తార‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మారిపోయింది. ఇక్క‌డే మ‌రో విష‌యం కూడా సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తావిస్తున్నారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలోనే త‌ప్ప‌ట‌డుగులు వేసి ఏకంగా అధికార‌మే కోల్పోయింది. మ‌రి ఇప్పుడు ఇంట గెలుస్తున్న జ‌గ‌న్ ర‌చ్చ గెల‌వ‌డ‌మే కీల‌క‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి ఆలోచ‌న చేస్తారో చూడాలి.