Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఓ దళారి...నిప్పులు చెరిగిన జగన్!
By: Tupaki Desk | 15 May 2018 4:54 PM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతులకు మేలు జరగకుండా అభివృద్ధి జరిగిందని అనడానికి చంద్రబాబుకు నోరు ఎలా వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలోని రైతులకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని నిప్పులు చెరిగారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు....దళారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు ఎవరైనా బాగుపడ్డారా?అని జగన్ ప్రశ్నించారు. రైతుల నుంచి తక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేసి....నాలుగు రెట్ల అధిక ధరకు హెరిటేజ్ షాపుల్లో అమ్ముతున్నారని దుయ్యబట్టారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తోందన్నారు. అంతేకాకుండా, పోలవరం నిర్వాసితుల పాలిట చంద్రబాబు దళారిగా మారిపోయారని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు...చంద్రబాబు కొత్తగా కట్టుకున్న ఇంటి బాత్రూం సైజు కూడా లేవని జగన్ దుయ్యబట్టారు. దెందులూరులో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందనలేదని జగన్ అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకపోగా....వాటిని తమ వెబ్ సైట్లోనుంచి కూడా తొలగించిందన్నారు. బాబు హయాంలో ప్రజల ఇళ్లకు వేలం నోటీసులు వస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో రైతులకు, పొదుపు సంఘాలకు బ్యాంకులు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం లేదని జగన్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ ఆర్ చలవతోనే పోలవరం ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చిందన్నారు. వైఎస్ హయాంలోనే కుడికాల్వలో 90 శాతం - ఎడమ కాలువలో 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. నాలుగేళ్లలో మిగిలిన పనులు పూర్తి చేయడం కూడా చంద్రబాబుకు చేతకాలేదన్నారు. నిర్మాణానికి సంబంధించిన ముడిసరుకుల రేట్లు తగ్గుతున్నా.....కాంట్రాక్టర్లకు అధికంగా డబ్బు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం కాంట్రాక్టర్ యనమలకు వియ్యంకుడు కావడం వల్లే ఈ రకంగా లోపాయికారి ఒప్పందం కుదిరిందని దుయ్యబట్టారు.
జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్న సందర్భంగా ఆయా ప్రాంత ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వాటికి పరిష్కారాలు కనుగొనే దిశగా మేధోమథనం చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ పనికి వచ్చే అంశాలపై ఉమ్మడిగా హామీలు ఇస్తున్నారు. అదే రీతిలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ .....ఆ జిల్లా ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. గోదావరి ప్రాంతవాసులతోపాటు ఏపీకి కీలకమైన పోలవరం పై జగన్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా పోలవరం లో అధికశాతం పనులు తన హయాంలోనే చేపట్టామని.ప్రగల్భాలు పలికే చంద్రబాబును జగన్ ఎండగట్టారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్లు ....సరిగా లేవని, అక్కడ కనీస సదుపాయాలు లేదని జగన్ కీలకాంశాలను లేవనెత్తారు. పోలవరం నిర్వాసితులను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లగలిగారు. ఏది ఏమైనా పశ్చిమగోదావరి ప్రజలను ఆకట్టుకునేలా జగన్ ప్రసంగం ఉందని చెప్పవచ్చు.