Begin typing your search above and press return to search.

జగన్ ఫిక్స్ అయిపోయారా : పవన్ మీద మళ్ళీ మళ్ళీ అదే మాట...?

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
జగన్ ఫిక్స్ అయిపోయారా : పవన్ మీద మళ్ళీ మళ్ళీ అదే మాట...?
X
ఏపీలో రాజకీయ పక్షాలు వేటికవే ఉన్నాయి. దేని రాజకీయం అది చేస్తోంది. పొత్తులు ఎత్తులూ ఎన్ని ఉన్నా కూడా ప్రతి రాజకీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది. అలా కనుక చూసుకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ తనది, తన ఫిలాసఫీ తనది అని ఎన్నో సార్లు చెప్పుకుని వస్తున్నారు. ఇక తన పార్టీ ఉనినికి కాపాడుకోవడానికి తన పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి ఆయన చేయాల్సింది చేసుకుని వెళ్తున్నారు.

అయితే పవన్ని మాత్రం చంద్రబాబుకు దత్తపుత్రుడుగానే జగన్ ఫిక్స్ చేసి పారేశారు. ఆయనకంటూ వేరే పార్టీ ఉన్నా లేనట్లే అన్న భావనలో వైసీపీ అధినాయకుడు ఉన్నట్లుగా తోస్తోంది. ఆయన జనాలకు కూడా అదే ప్రచారాన్ని చేస్తూ వారి మదిలో కూడా అ భావనను నాటుతున్నారు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మేలు కోసం, ఆయన మంచి కోసమే ఎప్పుడూ తాపత్రయపడుతున్నారు అని జగన్ అంటున్నారు. ఆయన ప్రతీ మీటింగులో ఇదే చెబుతున్నారు. చంద్రబాబుకు కవచాలుగా అనుకూల మీడియాతో పాటు పవన్ కూడా ఉన్నారని జగన్ చెప్పుకుని వస్తున్నారు.

లేటెస్ట్ గా శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన సభలో కూడా పవన్ని దత్తపుత్రుడు అనే సంభోదించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ చేస్తున్న మంచి ఏదీ చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కి ఏ కోశానా కనిపించడంలేదని కూడా జగన్ విసుర్లు విసిరారు. నాడు టీడీపీ తన ఎన్నికల మ్యానిఫేస్టోలో రైతులకు రుణ మాఫీ పెట్టిందని, అలాగే అనేక రకాలైన రాయితీలను ప్రకటించిందని, అయిదేళ్ల పాలనలో వాటిని ఎగ్గొట్టి ఏమీ చేయని చంద్రబాబు మంచిగా కనిపిస్తున్నారా అంటూ పవన్ని జగన్ ప్రశ్నించారు.

రైతులకు ఎవరెంత మేలు చేశారో తమ దగ్గర లెక్కలు ఉన్నాయని, ఈ ప్రాంతం పవన్ కానీ చంద్రబాబు కానీ వస్తే ప్రజలు ఆ వివరాలు చెప్పి నిలదీయాలని కూడా జగన్ కోరడం విశేషం. మొత్తానికి జగన్ తన ప్రతీ మీటింగులో కూడా పవన్ని బాబు గారి దత్తపుత్రుడు అనే ట్యాగ్ తగిలించి మరీ విమర్శిస్తున్నారు. ఈ విషయంలో జనసేన ఎంత మండిపాటు పడినా ఉపయోగం అయితే కనిపించడంలేదు. ఒక వ్యూహం ప్రకారం ఏపీలో బాబు పవన్ని ఒక గాటకు కట్టి జగన్ విమర్శలు చేస్తున్నారు అనుకోవాలి.

ఆ ఇద్దరూ వేరు కాదు ఒక్కటే అని చెప్పడం ద్వారా ఎవరికి ఓటేసినా వైసీపీకి యాంటీగానే ఉంటుందని తెలియచెప్పడం ద్వారా భారీ రాజకీయ లాభాన్నే ఆశిస్తున్నారు. అదే టైమ్ లో ఏపీలో మూడవ పొలిటికల్ ఆల్టర్నేషన్ గా జనసేన ఎంతవరకు ఎదుగుతుందో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు ఏవీ చేయకుండా బాబు తో పాటే పవన్ని కట్టేసి జగన్ కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు.

మరి దీని మీద జనసేన సీరియస్ గానే ఆలోచన చేసి ఈ ట్యాగింగ్ నుంచి తమను తాము వేరు చేసుకునే మార్గాన్ని చూసుకోవాలి. జగన్ మాత్రం బాబుకు పవన్ దత్తపుత్రుడు అని, ఇక అంతే ఇదే ఫిక్స్ అని జనాల్లోకి ఇప్పటికే ఒక బలమైన సందేశాన్ని పంపించేశారు. దాన్ని మాపుకోవడం కష్టమైనా కూడా చిత్తశుద్ధితో జనసేన ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యమే. మరి ఈ విషయంలో జగన్ని వైసీపీని రెండు మాటలు అనేసి ఊరుకుంటే అది జనసేనకే ఇబ్బంది తప్ప ఆ ట్యాగ్ మాత్రం పోదు అన్నదే కచ్చితమైన విశ్లేషణ.