Begin typing your search above and press return to search.

మొద‌టి మాట‌తోనే మ‌న‌సు దోచేసిన జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   24 May 2019 4:49 AM GMT
మొద‌టి మాట‌తోనే మ‌న‌సు దోచేసిన జ‌గ‌న్‌!
X
అద్భుత విజ‌యం అన్న మాట కూడా జ‌గ‌న్ గెలుపు ముందు త‌క్కువేనేమో. క‌ల‌లో ఊహించ‌ని రీతిలో రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఏ స‌మ‌యానికి ఎంత మాట్లాడితే మంచిదో అంతే మాట్లాడిన ఆయ‌న మ‌న‌సు దోచేశారు. త‌న‌కు ఆఖండ విజ‌యాన్ని అందించిన ఏపీ ప్ర‌జ‌ల‌కు విన‌మ్ర‌త‌తో కృతజ్ఞతలు చెప్పారు.

మైకు దొరికిందే సందు క‌దా అని అదే ప‌నిగా మాట్లాడ‌లేదు. భారీ విజ‌యం త‌ర్వాత మాట్లాడిన వేళ‌.. త‌న స‌క్సెస్ ను గొప్ప‌గా చెప్పుకోలేదు. వైరి ప‌క్షాన్ని ఉద్దేశించి అన‌వ‌స‌ర వ్యాఖ్య చేయ‌లేదు. మెచ్యూర్డ్ గా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్ మూడు ముక్క‌ల్లో మొత్తం విష‌యాన్ని చెప్పేసే తీరులో మాట్లాడి మ‌న‌సు దోచేశారు.

త‌న ల‌క్ష్యం ఏమిటో చెప్పిన ఆయ‌న‌.. ఆర్నెల్ల కాలంలో ది బెస్ట్ సీఎంగా అనిపించుకుంటాన‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల్లో ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చునే అవ‌కాశం దేవుడు ఒక్క‌డికే ఇస్తాడు. ఈసారి ఆ అవ‌కాశం నాకు వ‌చ్చింది. పాల‌న అంటే ఏమిటి? అస‌లు పరిపాల‌న ఎలా ఉంటుంద‌నేది మీకు చూపిస్తా. ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపే జ‌గ‌న్ మంచి ముఖ్య‌మంత్రి అని అంద‌రితో అనిపించుకుంటాన‌ని వ్యాఖ్యానించారు.

గెలుపు మీద బ‌డాయి మాట‌లు మాట వ‌ర‌స‌కు కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌.. తాను అంద‌రిని క‌లుపుకుపోతాన‌న్న విష‌యాన్ని త‌న మాట‌లతో చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. ప్ర‌త్య‌ర్థి పార్టీని ఉద్దేశించి మాట్లాడ‌ని జ‌గ‌న్‌.. కాక‌లు తీరిన రాజ‌కీయ నేత‌గా హుందాగా వ్య‌వ‌హ‌రించారు. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత తొలి సంత‌కం ఏదో ఒక ఫైల్ పై పెట్టాల‌నే ఫార్మాలిటీని జ‌గ‌న్ తోసిపుచ్చారు.

న‌వ‌ర‌త్నాల‌పై త‌న‌కు చాలా న‌మ్మ‌కం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పిన ఆయ‌న‌.. అన్ని ఫైళ్ల‌పై సంత‌కాలు పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. న‌వ‌ర‌త్నాల్ని తాను గ‌ట్టిగా న‌మ్ముతాన‌ని.. ప్ర‌జ‌ల క‌ష్టాల్ని పాద‌యాత్ర‌లో క‌ళ్లారా చూశాన‌ని.. బాధ‌ప‌డుతున్న ప్ర‌తి ఒక్క‌రికి హామీ ఇస్తున్నాన‌న్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఒక్క సంత‌కం కాదు..న‌వ‌ర‌త్నాల్ని తీసుకొచ్చే పాల‌న క‌చ్ఛితంగా ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ స్వీకారం విజ‌య‌వాడ‌లో ఉంటుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన జ‌గ‌న్‌.. ఈ నెల 30న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని.. త‌న‌కు..తన పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి మ‌రోసారి ధ‌న్య‌వాదాలంటూ.. చెప్పాల్సిన విష‌యాన్ని అన‌వ‌స‌ర మాట‌ల్ని మాట్లాడ‌కుండా సూటిగా చెప్పేశార‌ని చెప్పాలి. ఘ‌న విజ‌యం త‌ర్వాత జ‌గ‌న్ మాట‌లు మ‌నసుల్ని దోచేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.