Begin typing your search above and press return to search.

మండలి ‘సెలెక్ట్’ పై జగన్ ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   23 Jan 2020 2:38 PM GMT
మండలి ‘సెలెక్ట్’ పై జగన్ ఏమన్నారంటే?
X
నవ్యాంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడటంతో పాటుగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ... అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సాగుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... బుధవారం నాడు శాసన మండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నారట. ఈ పరిణామాలు తనను ఎంతగానో బాధపెట్టాయని స్వయంగా జగనే అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను బుధవారం నాడు శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మండలిలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటిపై జగన్ గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలు నా మనసును ఎంతగానో బాధించాయి. కొన్ని అంశాలను సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువస్తున్నా. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో మేం గెలిచాం. ఇది ప్రజల సభ, ప్రజలు ఆమోదించిన సభ, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ. చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభ . మండలి అన్నది చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. మా నమ్మకంతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతును అందరూ గమనించారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదు. నిన్న గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని జారీ చేసిన ఆదేశాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుంది. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు, లేకపోతే, సవరణలు కోరుతూ తిప్పి పంపించవచ్చు. చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కానీ, వాటిని లెక్క చేయకుండా విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు చూస్తుంటే... రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ తీరు జగన్ ను ఎంత బాధపెట్టిందన్న విషయం ఇట్టే అర్థం కాకమానదన్న వాదన వినిపిస్తోంది. చట్టాలను ఉల్లంఘించి చట్ట సభలు ఎలా వ్యవహరిస్తాయని కూడా ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. నిష్ఫక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్న చైర్మన్... తన పార్టీ అధినేత చెప్పినట్లుగా నడుచుకుని చట్ట సభలకు ఉన్న గౌరవాన్ని తీసేశారని, వెరసి ప్రజలు చట్ట సభలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా రెండు రోజుల పాటు రెండు బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ రచించిన వ్యూహం, చివరగా చైర్మన్ షరీప్ వ్యవహరించిన తీరు పట్ల జగన్ తనదైన శైలి నిరసనను ఈ విధంగా తెలిపారన్న మాట.