Begin typing your search above and press return to search.

ఈ ప్రకటనలతో వేడిని పెంచిన జగన్‌..!

By:  Tupaki Desk   |   18 Feb 2019 4:27 AM GMT
ఈ ప్రకటనలతో వేడిని పెంచిన జగన్‌..!
X
ఎన్నికల వేళ అన్నీ ఫ్రీ అంటున్న చంద్రబాబు ప్రకటనలు చూశాం.. ఇప్పుడు అంతకుమించి ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల హామీలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేసేలా.. గురిచూసి ఓటు బ్యాంకు పై వరాల వాన కురిపించారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షలు.. గొర్రెలు - మేకలు చనిపోతే యాదవులకు రూ.6వేలు పరిహారం.. చిరువ్యాపారులకు గుర్తింపు కార్డుల ద్వారా వడ్డీ లేకుండా రూ.10వేలు.. ఇవన్నీ వైసీపీ నేత ప్రజలపై కురిపిస్తున్న హామీలు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రజలతో మమేకమవుతోంది. సభలు - సమావేశాలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో జగన్‌ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర పేరిట రాష్ట్రమంతా పర్యటించిన ఆయన ఇప్పుడు బహిరంగ సభల ద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వెల్లడిస్తున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ప్రజా గర్జన సభలో వైసీపీ అధినేత జగన్‌ ప్రసంగించారు. ఈ సభ పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోగా తలపించింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎస్సీ - ఎస్టీ - బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అందులో భాగంగానే పార్టీ నామినేటేడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలందరినీ తనవైపుకు ఈ ఒక్క ప్రకటనతో తిప్పుకున్నారు.. అన్ని పార్టీల్లో ఈ విధంగా అమలు చేసేలా చట్టం తీసుకొస్తామన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ జాబితా నుంచి కొన్ని కులాలను తీసివేశారని - అమరావతికి వచ్చినప్పుడు ఈ విషయంపై చంద్రబాబుకు గుర్తురాలేదా..? అని జగన్‌ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఈ విషయంపై కేసీఆర్ తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో కేసీఆర్‌ తో సమావేశం నిర్వహించి మాట్లాడుతామన్నారు.

అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ప్రతి చేనేతకు పెట్టుబడి కింద రూ.2వేలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రధాన ఆలయ బోర్డుల్లో నాయిబ్రాహ్మణులకు - యాదవులకు అవకాశం కల్పిస్తామన్నారు.