Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పేల్చిన తూటాలు ఇవే!

By:  Tupaki Desk   |   3 Aug 2017 2:14 PM GMT
జ‌గ‌న్ పేల్చిన తూటాలు ఇవే!
X
ఉప ఎన్నిక‌లు ఎప్పుడు.. ఎక్క‌డ వ‌చ్చినా అధికార‌ప‌క్షానికి సానుకూలంగా ఉండ‌టం క‌నిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్పాలి. మ‌ళ్లీ.. అలాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితులు తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి.. కాల‌క్ర‌మంలో అవ‌కాశవాద రాజ‌కీయాల కోసం పార్టీని విడిచి పెట్టి ఏపీ అధికార‌ప‌క్షం టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

అనంత‌రం గుండెపోటుగా ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున శిల్పా మోహ‌న్ రెడ్డి బ‌రిలోకి దిగితే.. ఏపీ అధికార‌ప‌క్ష త‌ర‌ఫున భూమా బ్రహ్మానంద రెడ్డి బ‌రిలోకి దిగారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌కు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు భారీగా హాజ‌ర‌య్యారు. అశేష ప్ర‌జానీకాన్ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. ఏపీముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాక్ష‌స పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన జ‌గ‌న్ ఏమ‌న్నారు? ఏయే అంశాల్ని ప్ర‌స్తావించారు? అన్న విష‌యాల్ని ఆయ‌న మాట‌ల్లోనే చెబితే..

= నంద్యాలలో జరుగుతుంది ఉప ఎన్నిక కాదు.. ధర్మయుద్ధం. ధర్మానికి అధర్మానికి - న్యాయానికి అన్యాయానికి మధ్య‌ యుద్ధం. ఇది విశ్వాస‌ రాజకీయాలకు వంచన రాజకీయాలకు మధ్య జరుగుతున్న యుద్ధం.. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలపైనా.. కుట్రలు.. అవినీతి పైనా.. అసమర్థ పాలనపైనా ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

= చంద్రబాబు దోచుకున్న మూడున్నర లక్షలకోట్లలో కొంత డబ్బు వెదజల్లి పోలీసులను నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. మనుషుల్ని కొనుగోలు చేస్తూ.. చంద్రబాబు చేస్తున్న పాలన మీద చేస్తున్న యుద్ధం ఈ ఉపఎన్నికలు. 2019లో జరగబోయే కురుక్షేత్రం సంగ్రామానికి నాంది ఈ ఎన్నికలు. ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర. ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు.. యుద్ధం చేయనక్కర్లేదు.. తమ చూపుడు వేలితో ఈవీఎం అనే విష్ణు చక్రం తిప్పుతూ చంద్రబాబు కౌరవ సామ్రాజ్యం కూకటి వేళ్లతో పెకలించాలి.

= ఏ మతాన్ని చూసుకున్నా.. భగవద్గీత - బైబిల్‌ - ఖురాన్‌ చదివినా అవి చెప్పేది ఒకటే. ధర్మం న్యాయం గొప్పవని చెబుతాయి. ఖురాన్‌ తెలిపే మహ్మద్‌ ప్రవక్త గురించి మీకు ఓ కథ చెబుతున్నాను. ‘మహ్మద్‌ ప్రవక్తను హత్య చేసేందుకు కుట్ర దారులంతా ఒక చోట ఏకమవుతారు. సత్య సందేశాన్ని సహించలేని వీరంతా దారుల్‌ నాదువాలో సమావేశం అయ్యి హత్య గురించి చర్చిస్తారు. అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు పెడతారు. చివరగా అబూ జహన్‌ అనే కుట్రదారుడు చేసిన ప్రతిపాదన అందరికీ నచ్చుతుంది.. అదేమిటంటే అన్ని తెగల నుంచి పలుకుబడి ఉన్న కుటుంబాల్లోని యువకులను ఎంపిక చేసి వారికి కత్తులు ఇచ్చి వారంతా కూడా మహ్మద్‌ ప్రవక్త మీద దాడి చేస్తే నేరం అందరిపై పడుతుంది. అలా జరిగితే అందరిపై పోరాడలేరు. పరిహారం ఇవ్వాలని మాత్రమే అడుగుతారని చెప్పగా ఇది అందరికి నచ్చుతుంది. దీంతో అలాగే యువకులను ఎంపిక చేసి మహ్మద్‌ ప్రవక్తను హత్య చేసేందుకు ప్రవక్త ఇంటిని చుట్టు ముడతారు. ఆ విషయం జబ్రీల్‌ అనే దైవదూత ద్వారా తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ ఇసుక తీసుకొని హత్య చేసేందుకు వచ్చినవారి తలలపై జల్లుతూ నవ్వుతూ వెళ్లిపోతారు. ఆ సమయంలో వారు ఏం చేయలేక తలలు వంచుతారు. దీనర్ధం ఏమిటంటే దొంగదెబ్బతీసేవారు.. వెన్నుపోటు పొడిచేవారు ధర్మం ముందు తల వంచాల్సిందే. ఇదే విషయాన్ని ఖురాన్‌ చెబుతోంది.

= అబ‌ద్ధాల‌తో తాత్కాలిక విజయం రావొచ్చు.. కానీ, సత్యవంతులదే విజయం అని ఖురాన్‌ అని చెబుతుంది. అన్ని మతాలు కూడా ఇదే చెబుతాయి. ఏ మతమైనా తప్పును తప్పంటుంది.. దొంగను దొంగేనని, మోసాన్ని మోసమేనని చెబుతుంది.

= సీతమ్మను దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణుడిని రాక్షసుడు అంటాం.. మన పొలం పంటను, మన ఆస్తిని ఎత్తుకుపోయినవారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడిని బూచాడని అంటాం. మరీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లిన వారిని ఏమనాలి? వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబునాయుడిని ఏమనాలి? దొంగ అంటామా? సీఎం అని అంటామా..? ఇది దొంగల పాలన అంటామా? ప్రజల పాలన అంటామా? సొంతమామనే వెన్నుపోటు పొడిచి ఆయన కష్టంతో వచ్చిన‌ ఆయన పదవిని, ఆయన పార్టీ గుర్తును లాగేసుకున్న వ్యక్తిని ఏమంటాం?

= మిగితా పార్టీల్లో చిచ్చుపెట్టే వ్యక్తిని ఏమంటాం? ప్రజలను వెన్నుపోటు పొడిచే వ్యక్తిని ఏమంటాం? అప్పట్లో చంద్రబాబును ఉదహరిస్తూ నాన్నగారు వైఎస్‌ఆర్‌ ఓ కథ చెప్పేవారు. అనగనగా ఓ ముద్దాయి ఉండేవాడు. అతడు కోర్టు బోనులో ఉన్నాడు. జడ్జి రాగానే బోరున ఏడ్వడం మొదులపెట్టాడు. తల్లితండ్రి లేని ఆనాధను వదిలేయండి అన్నాడు.. మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. జడ్జికి బాధ కలిగి లాయర్లను అతడు చేసిన నేరం ఏమిటని అడగ్గా.. పబ్లిక్‌ప్రాసీక్యూటర్‌ ఏమన్నారో తెలుసా.. తల్లితండ్రిని చంపిన వ్యక్తి అని చెప్తాడు. ఇది చంద్రబాబు నైజం. చంద్రబాబే తన మామ ఎన్టీఆర్‌ ను చంపి ఆయనే ఫొటోలు తెచ్చి ఎన్నికలకు వెళతాడు. మొన్నటి వరకు మైనార్టీలను దెబ్బ కొట్టాడు. ఎన్నికలు రాగానే మళ్లీ అదే మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నాడు. రైతులను - డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను మోసం చేశాడు.

= ఆంధ్రప్రదేశ్‌ లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇస్తున్నా. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. కానీ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతాం., మొత్తం 25 జిల్లాలుగా మారుస్తాం. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్‌..ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తాం.